హైదరాబాద్ ఉలిక్కిపడింది. నిన్న ఒక్క రోజే గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో ఏకంగా 122 కేసులు వెలుగుచూశాయి. తెలంగాణ మొత్తంలో 199 కేసులు నమోదుకాగా.. అందులో 122 కేసులు గ్రేటర్ లోనివే కావడం ఆందోళన రేకెత్తించింది. రాష్ట్రంలో ఒక్క రోజులో అత్యథిక కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి.
ఇక హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న రంగారెడ్డిలో కొత్తగా 40 కేసులు, మేడ్చల్ లో 10 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఒక్క రోజులో 172 పాజిటివ్ కేసులు నమోదైనట్టయింది. లాక్ డౌన్ సడలింపుల వల్లనే కేసులు పెరుగుతున్నాయనేది అక్షర సత్యం. ఆందోళన కలిగించే మరో అంశం ఏంటంటే… పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి వస్తున్న వారి కంటే నగరంలో ఉంటున్న వ్యక్తుల్లోనే ఎక్కువగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి.
పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లలో 192 మందికి, అంతర్జాతీయ ప్రయాణికుల్లో 30 మందికి, సౌదీ నుంచి వచ్చిన వాళ్లలో 212 మందికి ఇప్పటివరకు కరోనా సోకింది. వీళ్లతో కలుపుకొని తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 2698కి చేరింది. వీళ్లలో 1428 మంది డిశ్చార్జ్ కాగా.. 1188 మందికి ట్రీట్ మెంట్ నడుస్తోంది. ఆదివారం ఒక్కరోజే కరోనా కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 82కు చేరుకుంది.
గ్రేటర్ లోని పహాడీ షరీఫ్ ప్రాంతంలో 43 కేసులు నమోదవ్వగా.. వీళ్లంతా కేవలం 5 కుటుంబాలకు చెందిన వారు. ఆరు రోజుల కిందట ఇక్కడ 14 కేసులు వెలుగుచూశాయి. కట్ చేస్తే.. ఇప్పుడు ఏకంగా సంఖ్య 43కు చేరింది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు.
మరోవైపు ప్రభుత్వం విడుదల చేస్తున్న లెక్కలపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నల్గొండలో వారం రోజుల కిందట ఓ పాజిటివ్ కేసు నమోదవ్వగా.. బులెటిన్ లో 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదుకానీ జిల్లాల జాబితాలో నల్గొండను చూపించారు. ఇక సిద్ధిపేటలో 2 రోజుల కిందట ఓ వ్యక్తికి కరోనా సోకినట్టు స్వయంగా అధికారులు ప్రకటించారు. లిస్ట్ లో మాత్రం 14 రోజులగా ఒక్క కేసు కూడా నమోదుకాని జిల్లాల జాబితాలో సిద్ధిపేటను చేర్చారు.