నిజమే. పదవి విషయంలో ఆనందమో బాధో ఏదో ఒకటి మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు తానుగా అనుభవిస్తే అది ఒక పధ్ధతి. కానీ నిమ్మగడ్డ కంటే ఎక్కువగా గుక్క పట్టి పచ్చ పార్టీ నేతలు ఏడుస్తున్నారు. చొక్కాలు చింపుకుంటున్నారు.
ఇది చూసిన వారికి విడ్డూరంగానే ఉంటోంది. నిమ్మగడ్డ మీద ఎందుకంత ప్రత్యేకమైన అభిమానం అన్న డౌట్లు కూడా ఏ మాత్రం రాజకీయం తెలియని వారికి కూడా పుడుతున్నాయి.
నిమ్మగడ్డ విషయంలో ఎందుకు చంద్రబాబు గుండెలు బాదుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సీదరి అప్పలరాజు అంటున్నారు. మీ హయాంలో నియమించినందున నిమ్మగడ్డ పట్ల అంత అనురాగం ఎందుకు పొంగిపొర్లుతోందో చెప్పాలి బాబు అంటున్నారు.
నిమ్మగడ్డకు టీడీపీకి ఉన్న సంబంధం ఏంటో కూడా తేలాలని అప్పలరాజు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. మీ ప్రయోజనాలు ఏంటో, నిమ్మగడ్డను కొనసాగించాలని అంతలా పట్టుదలకు పోతున్న మీ ఉద్దేశ్యాలు ఏంటో ప్రజలకు తెలియాల్సి ఉంది అని టీడీపీ నేతలను ఉద్దేశించి డాక్టర్ గారు బాగానే క్లాస్ తీసుకున్నారు.
నిమ్మగడ్డను తిరిగి నియామకం చేసే విషయంలో కోర్టు నిర్దేశిత గడువు చెప్పనందువల్ల తాము ఈ విషయంపైన సుప్రీం కోర్టుకు వెళ్తామని వైసీపీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఇంతలోనే ఏదో జరిగిపోయినట్లుగా నిమ్మగడ్డకు మద్దతుగా కోరస్ రాగాలు, ఏడుపు దీఘాలు తీయడం అవసరమా పచ్చ పార్టీ నేతలూ అంటున్నారు ఎమ్మెల్యే. మొత్తానికి తమ బంధం చాలా గట్టిదని పచ్చ పార్టీ నేతలు చెప్పకనే చెప్పేసుకుంటున్నారని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.