పట్టపగలే కత్తులతో స్వైర విహారం. దాదాపు 30 మంది యువకులు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు, ప్రతిదాడులు చేసు కున్నారు. పెద్ద ఎత్తున అరుపులు…ఆ ప్రాంత ప్రజలు భయంతో తలుపులు వేసుకున్నారు. భయానక వాతావరణం. అసలేం జరుగుతున్నదో అర్థం కాని గందరగోళ పరిస్థితి. సినిమా షూటింగ్‌ను తలపించేలా ఫైటింగ్ సీన్. ఇలా ఓ గంటపాట యథేచ్ఛగా జరిగిన గొడవలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రగాయాలపాలై ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ గొడవకు కారకులు చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే కడప నుంచి వెళ్లిన గూండాలు కాదు. పులివెందుల పహిల్మాన్లు కూడా కాదు. రాయలసీమ నుంచి వెళ్లిన రౌడీల పని అంతకన్నా కాదు. కానీ రూ.2 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ విషయమై విజయ వాడలోని రెండు వర్గాలకు చెందిన రౌడీ మూకల పని. యుద్ధ వాతావరణాన్ని తలపించిన ఈ గొడవ ఏ రాయలసీమలోనో జరిగింది కాదు. రాజధాని నగరమైన విజయవాడ పటమట ప్రాంతంలో పట్టపగలు జరిగింది.
రాయలసీమ వాసులంటే నరుక్కునే వాళ్లు, చంపుకునేవాళ్లు, మూర్ఖులు, దుర్మార్గులు అని దుష్ప్రచారం చేసే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధ్యక్షుడు, ఎల్లో మీడియా…విజయవాడలో కత్తుల స్వైర విహారం గురించి ఏం చెబుతారు? ఏం రాస్తాయి? ఈ ఘటనను ఆధారంగా చేసుకుని కోస్తా సంస్కృతి ఇదే అని ఏ నాయకుడైనా అంటే ఎలా ఉంటుంది? కోస్తా ప్రజల మనోభావాలు దెబ్బతినవా? ఒకట్రెండు గ్రూపుల తగాదాలను మొత్తం ఒక ప్రాంతానికి జనరలైజ్ చేయడం ఎంత తప్పో…రాయలసీమలో జరిగే ఘటనలను మొత్తం ఆ ప్రాంతానికి అంటకట్టడం కూడా అంతే తప్పు.
ఇలాంటి ఘటనలు ఏ ప్రాంతంలో జరిగినా తప్పే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వాటిని అణచివేయాల్సిందే. కానీ రాజకీయ స్వార్థ ప్రయోజనాలతో రాయలసీమ ప్రాంత మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడకూడదనే చెప్పేందుకే ఇదంతా. ఒకవేళ విజయవాడలో ఈ ఘటనకు సీమ వాసులు పాల్పడి ఉంటే…టీడీపీ, ఆ పార్టీ అనుబంధ చానళ్లు రాయలసీమపై ఎంతగా సాంస్కృతిక విద్వేషాన్ని చిమ్మేవో మాటల్లో చెప్పలేం. పులివెందల పంచాయతీ, సీమ సంస్కృతి అని అలవోకగా లేచే నోళ్లు…విజయవాడ ఘటనపై ఎందుకు మూసుకున్నాయ్?
-సొదుం