ఒక సినిమాను రీమేక్ చేయడం అంటే మాటలేమీ కాకపోవచ్చు. సూపర్ హిట్ అయిన సినిమాను రీమేక్ చేయడం అంటే వండటానికీ అన్ని అందుబాటులో ఉన్నట్టే, అయితే వండటం రావాలి! అలాగని ఏదోలా వండేయడం కాదు, రుచిగా వండాలి! ఇవే ముడిసరుకుతో అవతల వాళ్లు అద్భుతమైన రుచిగా వండారు, అన్నీ ఇచ్చినా రుచిగా వండలేకపోయారంటూ వంటగాడిపై తిన్న వాళ్లంతా విరుచుకుపడతారు. ఏ మాత్రం తేడా వచ్చినా అన్నీ ఉన్నా వంటను చెడబెట్టాడంటూ వంట చేసిన వ్యక్తిపై విరుచుకుపడే జనాలు, అలాగని రీమేక్ సినిమా రుచిగా ఉన్నా, వండిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వరు! అబ్బే.. నువ్వేం చేశావ్, వాడిని చూసి చేశావ్ గా అంటారు. కాబట్టి అధికారికంగా హక్కులు కొని రీమేక్ చేసే దర్శకులది ఏ రకంగా చూసినా ఇబ్బందికరమైన పరిస్థితే!
ప్రత్యేకించి ఆయా భాషల వాళ్లకే యాప్ట్ అయ్యే సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ సినిమాలను వేరే వాళ్లు తీసినప్పుడు ప్రాంతీయత అడ్డుపడొచ్చు. ఆ భాష వాళ్లకు ఆ సబ్జెక్టు, ఆ ముగింపు నచ్చి ఉండొచ్చు. మన భాషలో ఆ తరహా ట్రీట్ మెంటే నచ్చకపోవచ్చు.
ఆయా భాషల ను బట్టి, వారి వారి సంస్కృతులను బట్టి, వారి వారి సామాజిక పరిస్థితులను బట్టి రీమేక్ అయ్యే సినిమాలు నచ్చడం, నచ్చకపోవడం అనేది ఆధారపడి ఉండవచ్చు. అందరికీ యాప్ట్ అయ్యే స్టోరీలు ఎక్కడో కానీ ఉండవు. ఇక కొన్ని భాషల ప్రజల ఆలోచన సరళే భిన్నం. అక్కడ సినిమాల్లో అక్కడి ప్రజల ఆలోచనా సరళి ప్రతిబింబిస్తూ ఉంటుంది. ధాటైన డైలాగులు, ధీటైన సీన్లు ఉంటాయి ఆ సినిమాల్లో. అలాంటి సినిమాలను యథాతథంగా రీమేక్ చేసి చూపిస్తే తెలుగు వాళ్లు నచ్చుతుందా? అనేది మూవీ మేకర్లకు పెద్ద ప్రశ్నార్థకం.
అందుకే కొన్ని రీమేక్ ల విషయంలో క్లైమాక్స్ లు మార్చేస్తూ ఉంటారు. కొన్ని సీన్ల గాఢతను తగ్గిస్తూ ఉంటారు. టోన్ డౌన్ చేసి చూపి తెలుగు వాళ్లకు అనుగుణంగా తీర్చిదిద్దుతుంటారు. ఈ దిద్దడం కొన్ని సినిమాలకు వర్కవుట్ అవుతుంది, మరి కొన్ని సినిమాలకు వర్కవుట్ కాదు. రీమేక్ సినిమాలను చేసిన దర్శకులు ఇదే విషయాన్ని చెబుతుంటారు, ఫలానా తమిళ సినిమాను రీమేక్ చేసినప్పుడు ఆ కథలో మార్పులు చేయాల్సిందని, ఆ ట్రీట్ మెంట్ తమిళులకు నచ్చింది కానీ తెలుగు వాళ్లకు నచ్చదని… అంటుంటారు. తీరా సినిమా విడుదలపోయిన తర్వాత తాము చేసిన తప్పుల గురించి వారు తీరిగ్గా చెబుతుంటారు. అదంతా తాపీగా చేసే సమీక్ష.
ప్రస్తుతం చర్చలో ఉన్న కొన్ని మలయాళీ సినిమాల రీమేక్ ల ప్రతిపాదనల గురించి ప్రస్తావిస్తే..ఆ కొన్ని కొన్ని సినిమాల్లోని సీన్లను మనోళ్లు క్యారీ చేయగలరా? అంత ధాటి అయిన డైలాగులను పెట్టగలరా? అనేదే పెద్ద సందేహం. పొలిటికల్ సెటైరిక్ డైలాగులు ఉన్నాయి ఆ సినిమాల్లో. అలాంటి డైలాగులను మలయాళీలు ధైర్యంగా రాశారు. మరి మనోళ్లకు అంత సీనుందా?
మన దగ్గర చాలా రకాల డైలాగులకు చాలా మంది మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. కులం విషయంలో రచ్చ జరుగుతూ ఉంటుంది. సినిమా టైటిళ్ల దగ్గర నుంచినే రచ్చలు జరిగిన వైనాలను చూశాం. ఫలానా సినిమా టైటిల్ తమ కులాన్ని కించపరిచేలా ఉందని కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ఆ తర్వాత టైటిళ్లు మారడం, మారకపోతే జిల్లాల వారీగా నిషేధాలు ఇలాంటివెన్నో జరిగాయి. మరి కొందరు డైరెక్టర్లు ఏదేదో కసితో కొన్ని కులాలను కించపరడానికన్నట్టుగా కొన్ని ప్రస్తావనలు చేస్తూ ఉంటారు. ఇలా తెలుగు వారు చాలా సెన్సిటివ్ గా మారిపోయి చాలా కాలం అయిపోయింది.
అయితే మలయాళీలు మనతో పోలిస్తే చాలా భిన్నం. కుల, మత, రాజకీయాలపై సినిమాల్లో మంచి సెటైర్లుంటాయి. అలాంటి సెటైర్లు వేయగల సత్తా, వాటిని రిసీవ్ చేసుకునే తత్వం మలయాళీల్లో ఉందని స్పష్టం అవుతోంది.
అందుకు ఉదాహరణగా కొన్ని విషయాలను ప్రస్తావించవచ్చు. 'లూసీఫర్' సినిమాలో రాజకీయాల గురించి కాస్త లోతైన చర్చే జరుగుతుంది. వారసత్వ రాజకీయాలు, కొందరు నేతలు తనయులు వచ్చి మంత్రులైపోయి కనీసం సరిగ్గా మాట్లాడకలేకపోవడం.. ఇలాంటి అంశాలను ప్రస్తావించారు. అలాగే కొన్ని కొన్ని డైలాగులు కూడా ధాటిగా ఉంటాయి. కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్టులదే హవా. యుద్ధం వీరి మధ్యనే. ఈ విషయాన్ని లూసీఫర్ లో దాదాపు డైరెక్టుగా ప్రస్తావించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలుగా తాము కొట్టుకుంటూ ఉండటంపై .. అక్కడి నేతల డైలాగులుగా కొన్ని సెటైర్లు వేశారు. 'మనం మనం కొట్టుకుంటుంటే కేంద్రంలోని మతతత్వ పార్టీ వచ్చి ఇక్కడ పాగా వేస్తుంది..' అని ప్రతిపక్ష పార్టీ నేత, అధికార పార్టీ నేతను హెచ్చరించినట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది లూసీఫర్లో! ఒకవేళ ఆ సినిమాను రీమేక్ చేస్తే.. అలాంటి డైలాగు పెట్టగలరా తెలుగులో? ఆ డైలాగ్ ఏ పార్టీని ఉద్ధేశించి పెట్టారో స్పష్టం అవుతుంది. మరి ఇన్ డైరెక్టుగా అయినా అలాంటి పొలిటికల్ పంచ్ తెలుగులో వేయగలరా?
గుర్తించాల్సిన అంశం ఏమిటంటే.. అలాంటి సెటైర్లే ఆ సినిమాలను సూపర్ హిట్ చేశాయి. ఒకవేళ అలాంటి పంచ్ లు మిస్ అయితే ఆ సినిమాలు నిస్సారం అయిపోవచ్చు! 'అయ్యప్పనన్ కోషియం'లో కూడా సోషియల్ సెటైర్లుంటాయి. కులం, రాజకీయం గురించి అర్థవంతమైన డైలాగులు ఉంటాయి. మద్యనిషేధం ఉన్న చోట మందుబాటిళ్లను కార్లో పెట్టుకుని దొరికిన పృథ్విరాజ్ పాత్రను పోలీసులు అరెస్టు చేశాకా, అతడి మొబైల్ లో ఉన్న కాంటాక్ట్ లిస్టును పరిశీలిస్తారు. అందులో కొందరి ప్రముఖుల పేర్లు ఉంటాయి!
జార్జ్ అనే కాంగ్రెస్ పార్టీ నేత నంబర్ వాటిల్లో ఉంటుంది. అలా పేర్లను చదువుకుంటూ వస్తే.. ఒక చోట విజయన్ సార్ అనే కాంటాక్ట్ కూడా ఉంటుంది. దీంతో పోలీసులు అవాక్కవుతారు. కాంగ్రెస్ పార్టీ నేతల కాంటాక్ట్ లే గాక, సీఎం విజయన్ నంబర్ కూడా అతడి దగ్గర ఉందేమో అనుకుని వారు హడలిపోతారు. అయితే అది సీఎం విజయన్ సార్ నంబర్ కాదని, వేరే విజయన్ సార్ అని పృథ్విరాజ్ పాత్ర చెప్పడంతో వారు ఊపరిపీల్చుకుంటారు. ఇలాంటి సున్నితమైన పొలిటికల్ సెటైర్లు మలయాళీ సినిమాల్లో ఉంటాయి.
ఇక అయ్యప్పన్(బీజూమీనన్) పాత్ర కులం విషయంలో కూడా డైలాగులు పెట్టుకోగలిగారు. ఆ పాత్ర పూర్తి పేరు అప్పయన్ నాయర్, అయితే తను కులం రీత్యా నాయర్ కాదని ఆ పాత్ర చేత చెప్పించారు. తను పెరిగిన పరిస్థితుల్లో తనకు నాయర్ యాడ్ అయ్యిందని ఆ పోలీసు చెబుతాడు. ఒక దశలో 'నకిలీ నాయర్' అంటూ అతడిని తిడతాడు పృథ్విరాజ్. రీమేక్ చేసినప్పుడు ఏదైనా ఒక తెలుగువారి కులాన్ని ఉద్ధేశించి అలాంటి డైలాగులు మన దగ్గర ఊహించగలమా? మలయాళీలకు అదే పెద్ద విడ్డూరం అనిపించలేదు. కాంగ్రెస్ నేతల పేర్లు సినిమాల్లో వినిపించినా, సీఎం పేరునూ అలా టచ్ చేసినా, ఒక కులం పేరునూ ఆ రకంగా ప్రస్తావించినా.. అందులో అభ్యంతరాలు లేవు. అదంతా సెన్సాఫ్ హ్యూమర్ కోసం చేసిన పని, అయితే మన దగ్గర సున్నితత్వం ఎక్కువై పోయి అలాంటి వాటి జోలికి వెళ్లే ప్రయత్నం చేసే అవకాశాలు లేవు.
ఈ సినిమాలు అనే కాదు, ఇతర సినిమాల్లోనూ సామాజిక వ్యంగ్యాస్త్రాలు తప్పనిసరిగా ఉంటాయి. గత ఏడాది వచ్చిన మమ్ముట్టీ సినిమా 'మధురరాజా' అని ఒకటి ఉంటుంది. అందులో హీరో ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటాడు. ఆ సమయంలో అతడి దగ్గరున్న ఒక వ్యక్తి.. నేనే గనుక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద విగ్రహాన్ని కట్టి ఓటు అడిగే వాడ్ని అంటాడు! విగ్రహం ఖర్చు.. విగ్రహం భారీ తనంపై ఖర్చు.. ఈ సెటైర్ ఎవరి మీదో చెప్పనక్కర్లేదు. భారీ ఖర్చుతో పటేల్ విగ్రహం పెట్టడంపై పంచ్ విసిరారు. ఆ వ్యంగ్యం అక్కడ సెట్ అయ్యింది కూడా!
ఇక 'ట్రాన్స్' అనే మరో మలయాళ సినిమాలో క్రిస్టియానిటీ మీద వ్యంగ్యం వ్యక్తం చేయగలిగారు. పాస్టర్ల, ఫాదర్ల మోసాలను ప్రస్తావించగలిగారు. కేరళలో క్రిస్టియానిటీ ఎక్కువే. అయినా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అక్కడ ఎవరూ రోడ్డెక్కలేదు! ఆ మాటకొస్తే తమిళులూ సామాజిక వ్యంగ్యాన్ని కొంత వరకూ ఆస్వాధిస్తారు. తెలుగులో మాత్రం అదంత తేలిక కాదు! ఒకరిని చూసి మరొకరు మరింత సెన్సిటివ్ గా తయారైపోతున్నారు. మనసుల్లో బేధభావాలను, కులాల-రాజకీయాల వారీగా నిశ్చిత అభిప్రాయాలను తీవ్రంగా పెట్టుకున్నా, సినిమాల్లో కానీ, బయట కానీ అలాంటి విషయాలను ప్రస్తావిస్తే తెలుగు వాళ్లకు చాలా కోపమే వస్తుంది!
-జీవన్ రెడ్డి.బి