డిస్ట్రిబ్యూటర్ల చిట్కాలు, ఎగ్జిబిటర్ల గుట్లు మట్లు ఆ సర్కిల్ లో జనాలకే బాగా తెలుస్తోంది. బయటవారికి ఎలా వున్నా, ఆ బిజినెస్ లో వున్నవారికి ఏం జరుగుతోందో క్లారిటీ వుంటుంది. సాధారణంగా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఏ సినిమా ఎన్ఆర్ఎ మీద కొన్నా విరివిగా థియేటర్లలో విడుదల చేస్తారు. హిట్ అయినా కాకున్నా, పెట్టిన థియేటర్లు ఒక అంతట తీయరు. డెఫిసిట్ వస్తున్నా వుంచేస్తారు.
కానీ ఎఫ్ 3 విషయంలో మాత్రం ఆయన పూర్తిగా రివర్స్ స్ట్రాటజీలో వెళ్తున్నారు. అసలు విడుదల చేయడమే ప్లాన్డ్ గా విడుదల చేసారు. ఆ తరువాత కలెక్షన్లను బట్టి చకచకా థియేటర్లను లేపేసారు.
క్రాస్ రోడ్స్ లో ఏ సినిమా అయినా రెండు మూడు థియేటర్లలో రెండు వారాలు, మూడు వారాలు కనిపిస్తుంటుంది. అలాంటిది వన్ వీక్ కాగానే సింగిల్ థియేటర్ చేసేసారు. అంతే కాదు ఆయన ఓన్ డిస్ట్రిబ్యూషన్ వున్న ప్రతి చోట్లా థియేటర్లను తగ్గించి కలెక్షన్లు ఏకీకృతం అయ్యేలా చేసారు.
పెద్ద పెద్ద పట్టణాల్లో సైతం ఒకటి, రెండు థియేటర్లే పరిమితం చేసారు. నిజానికి ఇదంతా మంచిదే. సినిమాకు కలెక్షన్లు కనిపిస్తాయి. రెంట్ల ఖర్చులు కలిసి వస్తాయి. ఇక్కడ ఇండస్ట్రీలో వినిపిస్తున్న కామెంట్ ఒకటే మరి ఆయన స్వంత సినిమాకు ఇలా చేసినపుడు మిగిలిన వారి సినిమాలకు కూడా ఇలా చేయవచ్చుగా. ఆయన థియేటర్లను పోషించడం, ఖర్చులు రాసేయడం వల్ల నిర్మాతలు నష్టపోతున్నారుగా…అన్నదే ఆ కామెంట్.
ఏమైనా మనదైతే ఆ జాగ్రత్తే వేరు కదా?