నీతులు వల్లించడంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తనయుడు లోకేశ్ తర్వాతే ఎవరైనా. ప్రత్యర్థి పార్టీ తరపున గెలుపొందిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టి… ప్రజాస్వామ్య హననం గురించి మాట్లాడ్డం ఒక్క చంద్రబాబునాయుడికే చెల్లింది.
ఇలా ఒక్కటేమిటి… ఏవైతే చంద్రబాబు, లోకేశ్ పాటించరో వాటి గురించి గొప్పలు చెప్పడం తండ్రీతనయులకే చెల్లింది. అవినీతిని అరికట్టడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ యాప్‌ను ఆవిష్కరించారు.
యాప్‌ను ప్రజల ముందుకు తెచ్చింది ఓ ముఖ్యమంత్రి. కనీసం ఆ పదవికి గౌరవం ఇవ్వాలనే ఆలోచన లోకేశ్‌లో కొరవడింది. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
దేశంలోనే అత్యంత అవినీతి పరుడై సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటోన్న జగన్‌రెడ్డి అవినీతిని అరికడతామంటూ యాప్ ఆవిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే నన్నారు. యాప్‌కి 14400 నెంబర్ కాకుండా, 6093 అయితే యాప్ట్‌గా ఉండేదని వెటకరించారు.
అవినీతి చూస్తూ ఉండొద్దు, అవినీతి గురించి వింటూ ఉండొద్దు, అవినీతికి వ్యతిరేకంగా గొంతు విప్పండి అంటూ లెక్చర్ ఇస్తున్నారని తప్పు పట్టారు. అవినీతి అనకొండ జగన్ రెడ్డి గారూ.. అవినీతిపై ఈ నేతిబీరకాయ కబుర్లు మాని.. మీపై ఉన్న అవినీతి కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చెయ్యాలని కోరే దమ్ముందా అని లోకేశ్ సవాల్ విసిరారు.
తెలంగాణలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కై తెలంగాణ నుంచి ఏపీకి పలాయనం చిత్తగించిన ముఖ్యమంత్రి ఎవరో తెలుగు సమాజానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సూట్ కేసులతో డబ్బు చేతులు మార్చిన ఘనత ఎవరిదో అందరికీ తెలుసు.
డబ్బు తీసుకుని తమ వాడికి ఓటు వేయాలని బ్రీప్ చేసిన ముఖ్యమంత్రి, ఆయన తనయుడు కూడా నీతులు చెప్పడం కంటే సిగ్గుమాలిన చర్య ఏదైనా ఉందా? ఓటుకు నోటు కేసులో స్టే తెచ్చుకోకుండా, విచారణ ఎదుర్కొనే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉన్నాయా? ఇవేవీ లోకానికి తెలియదన్నట్టు లోకేశ్ నీతులు చెప్పడం… నేతిబీరకాయ కబుర్లు కాక మరేంటి?