తన పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ దేశ రాజధానిలో ఇచ్చిన పార్టీ హాట్ టాపిక్ గా మారింది. ఇది పుట్టిన రోజు పార్టీగా కన్నా, పొలిటికల్ మీటింగ్ గా బాగా ప్రచారానికి నోచుకుంటోంది. అటు కాంగ్రెస్ పార్టీలోనూ, ఇటు మీడియాలోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. కపిల్ సిబల్ ఈ పార్టీ ఇవ్వడం, అందులోనూ బీజేపీయేతర పార్టీల నేతలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపి హోస్టుగా మారడం ఆసక్తిదాయకంగా మారింది.
విశేషం ఏమిటంటే.. ఈ పార్టీలో ఎక్కడా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లేరు. కాంగ్రెస్ నేతలున్నారు కానీ, ఆ పార్టీ అధినేతలు లేరు. చిదంబరం, శశిథరూర్, మనీష్ తివారీ వంటి కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ పార్టీకి హాజరయ్యారు. కాంగ్రెస్ లో ఏదో ఒక మార్పు రావాలని ఆకాంక్షిస్తున్న బ్యాచ్ ఇదంతా. రాహుల్ తీసుకుంటే పూర్తి స్థాయిలో పగ్గాలు తీసుకోవాలి అని పైకి గట్టిగా చెబుతున్నా, రాహుల్ ఏదో ఒకటి తేల్చేసుకుంటే మంచిదన్నట్టుగా వ్యవహరిస్తున్న వాళ్లే వీళ్లంతా.
ఇక కపిల్ సిబల్ ఈ పార్టీలో తన ఉద్దేశాన్ని సూటిగా, స్పష్టంగానే చెప్పినట్టుగా భోగట్టా. భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టాలి, ఆ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెట్టగల దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పడాలి.. అనేది కపిల్ ఆలోచనగా తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఆ ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించలేదు. అందుకు సానుకూల పరిస్థితులు లేవు, బీజేపీకి ప్రత్యామ్నాయం అంటే.. అది కాంగ్రెస్ సోలోగా చేయగలిగేది కాదనే నగ్న సత్యాన్ని కపిల్ గట్టిగా ఒప్పుకుంటున్నారు. అందుకే బీజేపీయేతర పార్టీలన్నీ ఈ విషయంలో కలిసి రావాలని కపిల్ అంటున్నారు. ఈ పార్టీ వెనుక ఆయన ఉద్దేశం ఇదేనని స్పష్టం అవుతోంది.
మొత్తం 23 పార్టీల నేతలు కపిల్ ఇచ్చిన పార్టీకి హాజరయ్యాయి. వీటిల్లో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో తలపడుతున్న ప్రాంతీయ పార్టీలున్నాయి. అకాళీదల్, ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, టీఎంసీ, ఎస్పీ, బీజేడీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ.. ఇలాంటి ప్రాంతీయ పార్టీల నేతలు కూడా కపిల్ ఇచ్చిన విందుకు హాజరయినట్టుగా సమాచారం.