కర్ణాటకలో అనర్హతకు గురైన రెబెల్ ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. దురాశకు వెళ్లి ఉన్న పదవులు పోగొట్టుకున్నారు. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు పార్టీ మారినా.. పోటీ చేసేందుకు అనర్హులు కావడంతో చేసిదేమీ లేకుండా పోయింది. అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్‌కుమార్ అనర్హత వేటు వేయడంతో కాంగ్రెస్ – జేడీఎస్ కు చెందిన 17 మంది 2023 వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీలులేదు. రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని సంకీర్ణ ప్రభుత్వం నేతలు ఎంత బుజ్జగించినా.. దిగిరాకుండా ఎంతో బెట్టు చేశారు. తెగేదాకా లాగి చివరికి తమ రాజకీయ జీవితాలను బలి చేసుకున్నారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో తెలియడం లేదు. సుప్రీంకోర్టు కూడా స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అంటే మరో నాలుగేళ్లు అసంతృప్త ఎమ్మెల్యేలు ఇంటికి పరిమితం కావాల్సిందే. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రెబెల్ ఎమ్మెల్యేలు కుమారస్వామిని ఎప్పటికప్పుడు ఇబ్బందులు పెడుతూ వచ్చారు. 14 నెలల పాలన కాలంలో సంకీర్ణ ప్రభుత్వానికి ఏనాడూ సహకరించిన దాఖలాలు లేవు. అంతేకాకుండా పలుమార్లు మీడియా ఎదుట బాహాటంగా విమర్శలు గుప్పించిన సంఘటనలు కూడా ఉన్నాయి.
మంత్రి పదవుల కోసమో, పనుల కోసమో.. ఏదో విధంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే చివరికి బొక్కబోర్లా పడ్డట్టయింది. మంత్రి పదవుల కోసం గందరగోళ పరిస్థితులను సృష్టించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరికి పార్టీ మారినా.. పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చు. కొందరు ముఖ్యమంత్రిగా కుమారస్వామిని ఒప్పుకోలేక అడ్డం తిరిగారు. సిద్ధరామయ్యే మళ్లీ సీఎం కావాలని నానాయాగీ చేశారు. మరికొందరు ఎమ్మెల్యేలు అయితే అత్యధిక సీట్లు సంపాదించిన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి సీఎం కాకుండా కుమారస్వామికి పగ్గాలు అప్పగించడంపై అసంతృప్తిగా ఉన్నారు.
అలాగే జేడీఎస్‌లోనూ మంత్రి పదవులు దక్కలేదనే కసితో ముగ్గురు రాజీనామాలు చేసి చివరికి అనర్హతకు గురయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామలింగారెడ్డి తప్పించుకున్నారు. ఎంతో సీనియర్ అయినప్పటికీ మంత్రిపదవి దక్కలేదనే బాధతో తొలుత రాజీనామా చేసిన రామలింగారెడ్డి మిత్రపక్షం నేతల బుజ్జగింపులకు తలొగ్గి రాజీనామాను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. పార్టీలు మారితే పదవులు దక్కుతాయనే ఆశతో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇదే సమయంలో బీజేపీ కూడా ఆపరేషన్ కమల ద్వారా ఆఫర్ల వర్షం కురిపించడంతో ఆ పార్టీకి జై కొట్టేందుకు సిద్ధమై నిండా మునిగారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఎలాగూ మంత్రిపదవి దక్కేలాలేదు.. బీజేపీలోకి వెళితే అక్కడన్నా మంత్రి పదవులు దక్కుతాయనే ఆశతో రాజీనామా డ్రామాలకు తెరలేపారు. అయితే అనర్హత వేటు పడటంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. రెబెల్ ఎమ్మెల్యేల డిమాండ్లపై అన్ని రకాలుగా మన్నించి, తమ స్థానాలను సైతం త్యాగం చేసి ప్రభుత్వానికి కాపాడేందుకు వారు ప్రయత్నించారు.
ఫోన్లు చేశారు, స్వయంగా వెళ్లి కలిశారు.. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గలేదు. చేసేదిలేక అధిష్టానం సూచన మేరకు.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం స్పీకర్ వేటువేశారు.
కామ్రేడ్ కథ మొత్తం చెప్పిన విజయ్ దేవరకొండ
తల్లిపేరుతో సంజయ్ చేస్తే.. తండ్రి పేరుతో లోకేష్ చేశాడు