జీవితాంతం టీఆర్ఎస్ లోనే ఉండగలడా? 

రాజకీయ నాయకులు చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన ఉండదు. మెజారిటీ నాయకులది ఇదే వైఖరి. చచ్చినా పార్టీ మారాను అంటారు కొంతమంది. కానీ పార్టీ మారడం వల్ల లాభం కలుగుతుందని అనుకుంటే ఆ…

రాజకీయ నాయకులు చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన ఉండదు. మెజారిటీ నాయకులది ఇదే వైఖరి. చచ్చినా పార్టీ మారాను అంటారు కొంతమంది. కానీ పార్టీ మారడం వల్ల లాభం కలుగుతుందని అనుకుంటే ఆ పని చేసేస్తారు. కాబట్టి రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో చెప్పలేం. ఎక్కువమంది నాయకులు మీడియా ముందో, ఏదైనా సమావేశంలోనే ఏదో డామేజింగ్ గా మాట్లాడతారు. విమర్శలు రాగానే తాను అలా అనలేదని, మీడియా వక్రీకరించిందని అంటారు. 

తాను ఆ మాటలు అన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని …ఇలా ఏవేవో చెబుతారు. ఇలాంటి విన్యాసాలు రాజకీయాల్లో చాలా ఉంటాయి. ఇప్పుడు మాజీ ఉపముఖ్యమంత్రి కమ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తాడికొండ రాజయ్య వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ తో భేటీ అయ్యాడనే వార్త టీఆర్ఎస్ లో పెను దుమారం రేపింది. దానికి వివరణ ఇవ్వాలని ఆయనపై ఒత్తిడి వచ్చినట్లుగా ఉంది. దీంతో తాను జీవితాంతం టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పాడు. 

తాను లోటస్ పాండ్ కు వెళ్లలేదని, అనిల్ కుమార్ ను కలవలేదని, అది అసత్య ప్రచారమని గోడు వెళ్లబోసుకున్నాడు. తాడికొండ రాజయ్య ఇప్పటికీ వార్తల్లో వ్యక్తిగానే ఉన్నాడు. 2014 లో కేసీఆర్ మంత్రివర్గంలో రాజయ్య ఉప ముఖ్యమంత్రి అనే సంగతి తెలిసిందే కదా. అప్పట్లో ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశాడు. కానీ ఎంతోకాలం మంత్రి పదవిని అనుభవించలేదు. యేవో ఆరోపణలు వచ్చాయని కేసీఆర్ ఆయన్ని తీసిపారేశారు.

అందుకు కారణాలేమిటి, ఆ ఆరోపణలు ఏమిటనేది ఈనాటికీ స్పష్టత లేదు. తనను తీసేశాక ఇప్పుడు ఈటల రాజేందర్ మాదిరిగా రాజయ్య రచ్చ చేయలేదు. గమ్మున ఉండిపోయాడు. వేరే పార్టీలోకి వెళ్ళలేదు. కేసీఆర్ కు ఈ విధేయత, రాజభక్తి నచ్చినట్లున్నాయి. 2018 లో మళ్ళీ టిక్కెటు ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ నుంచి గెలిచాడు. తెలంగాణా వచ్చాక రాజయ్య మొదటి దళిత ఉప ఉపముఖ్యమంత్రి. కేసీఆర్  మీద విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు దళితుడైన  రాజయ్యను కేసీఆర్ అవమానకరంగా తీసేశారని, అన్యాయం చేశారని ఇప్పటికీ అంటుంటారు. ఆ విధంగా రాజయ్యను లైవ్ లో ఉంచుతున్నారు. 

ఇక తాడికొండ రాజయ్య.. షర్మిల భర్త అనిల్ ను కలిసిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో అనేక అనుమానాలు కలిగాయి. హైదరాబాద్‌ లోని లోటస్‌ పాండ్‌ రాజయ్య, అనిల్ సడెన్ సమావేశానికి వేదికైందని ప్రచారం జరిగింది. ఇది వ్యక్తిగత భేటీ అని పైకి చెబుతున్నా.. ఏదో జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేశారు కొందరు. షర్మిలతోనూ గతంలో రాజయ్య పలుసార్లు భేటీ అయినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఇలా వ్యక్తిగత సమావేశంతో మొదలయ్యే భేటీలు భవిష్యత్తులో మార్పులకు దారి తీస్తాయని అంటున్నారు విశ్లేషకులు. 

స్టేషన్ ఘన్‌ పూర్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజయ్యకు.. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి పడడం లేదనే సంగతి  రాజకీయ నాయకులకు, సామాన్య ప్రజలకూ తెలిసిందే. వీరి మధ్య సత్సంబంధాలు కరువయ్యాయి. ఒకే పార్టీలో ఉన్నా రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటున్నారు. పైగా కేసీఆర్ కడియంవైపే ఉండడం రాజయ్యకు నచ్చడం లేదు. కొంత కాలం కిందట వరంగల్ పర్యటనలో కడియం ఇంట్లో సీఎం కేసీఆర్  భోజనం చేయడం, ఎమ్మెల్సీగా మళ్ళీ అవకాశం ఇస్తానని హామీ ఇవ్వడంపై రాజయ్య అసహనంతో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. 

కడియం శ్రీహరికి పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే భావనతోనే రాజయ్య పార్టీ మార్పు ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిల భర్త అనిల్ ను ఆయన కలిసినట్లుగా చెబుతున్నారు. ఈ ప్రచారాన్ని ఇప్పుడు రాజయ్య తోసిపుచ్చినా ఈ రాజభక్తి ఇలాగే జీవితాంతం కొనసాగుతుందని చెప్పలేం. భవిష్యత్తులో ఆయన షర్మిల పార్టీలో కాకపోతే మరో పార్టీలోకి పోతుండొచ్చు. రాజయ్య టీఆర్ఎస్ లోనే పుట్టి పెరగలేదు. కాంగ్రెస్ నుంచి గులాబీ పార్టీలోకి వచ్చాడు. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు.