రాజకీయాల్లో నేరస్తుల చొరబాటును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి నేరస్తులు, వ్యాపారవేత్తల రాక క్రమంగా పెరుగుతోంది. దీంతో రాజకీయాలు అసాంఘిక శక్తుల ఆవాసంగా మారుతాయనే ఆందోళనతో సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. ఈ నేపథ్యంలో మంగళవారం వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చినట్టైంది. ఇదే సమయంలో ఈ తీర్పును ప్రజాస్వామిక వాదులు ఆహ్వానిస్తున్నారు.
ఎన్నికల నిమిత్తం తమ అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోపు రాజకీయ పార్టీలు వారి నేరచరిత్రను వెల్లడించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే హైకోర్టుల ఆమోదం లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఉపసంహరించడం వీలుకాదని తేల్చి చెప్పింది.
గతంలో బీహార్‌కు సంబంధించిన కేసులో అభ్యర్థులు 48 గంటల్లో తమ నేర చరిత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని లేకపోతే నామినేషన్ వేయడానికి ముందు అనుమతించిన తేదీకి కనీసం రెండు వారాల ముందు నేర వివరాలను బయట పెట్టాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
తాజా తీర్పును మరింత మెరుగుపరుస్తూ… దాన్ని 48 గంటలకు పరిమితం చేయడం గమనార్హం. అంతేకాదు, రాజకీయ పార్టీలు నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల్నే ఎందుకు ఎంచుకుంటున్నాయో, అందుకు గల కారణాల్ని ప్రజలకు తెలియజేయాలని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.
నేర చరిత్ర, కేసుల వివరాల్ని వెబ్‌సైట్‌లో అందరికీ తెలిసేలా అందుబాటులో ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా నేర వివరాలు వెల్లడించకుంటే… న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఆ పార్టీల గుర్తుల్ని నిలిపివేస్తామంటూ ఎన్నికల సంఘం కోర్టుకు వెల్లడించింది.