వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి రెండో నిందితుడైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఈడీ కేసులను తొలుత విచారించాలని సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వడంపై విజయసాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రధానంగా నమోదు చేసిన సీబీఐ కేసు విచారణ పూర్తికాకుండా, దాని ఆధారంగా నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసుపై స్వతంత్రంగా విచారణ చేపట్టడం ద్వారా నిందితుడి హక్కులకు భంగం కలుగుతుందంటూ విజయసాయిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసుతో సంబంధం లేకుండా ఈడీ కేసుపై ప్రత్యేకంగా విచారణ చేపట్టవచ్చంటూ ఈడీ కోర్టు హోదా ఉన్న సీబీఐ కోర్టు జనవరి 11న ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కేసు రుజువయ్యేదాకా నిందితుడు నిర్దోషిగానే పరిగణించాల్సి ఉంటుందని, ఒకవేళ సీబీఐ కేసులో నిర్దోషిగా విడుదలైతే దాని ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ కేసు నిలబడదని విజయసాయిరెడ్డి వాదన. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు ఉత్తర్వులను కొట్టివే యాలని, అప్పటి వరకు కింది కోర్టులో ఈడీ కేసులపై విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఎంపీ విజయసాయిరెడ్డి పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈడీ కేసులను తొలుత విచారించాలన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. విజయసాయిరెడ్డి వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఇదే అంశంపై జగతి పబ్లికేషన్స్, రఘురాం సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్లనూ హైకోర్టు కొట్టి వేయడం గమనార్హం.