తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు చెప్పిందే వేదం. అప్పుడయినా, ఇప్పుడయినా దీనికి తిరుగే లేదు. అయితే పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారవడం, బాబు వృద్ధాప్యం, చినబాబు చేతకానితనం.. వెరసి పార్టీలో అందరికీ ధిక్కార స్వభావం అలవాటైంది.
పార్టీ లేదు, బొక్కాలేదు అని సాక్షాత్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడే తేల్చేసినా, అధినాయకుడు ఏమీ చేయలేని పరిస్థితి ఉండటంతో.. మిగతావారికి కూడా టీడీపీ ఓ ఆటవస్తువులా మారింది. దానికి అనంతపురం జిల్లా రాజకీయాలే తాజా ఉదాహరణ..
అనంతపురం జిల్లా మొదటినుంచీ టీడీపీకి పెట్టని కోట. 2019 వైసీపీ ఫ్యాన్ గాలిలో కూడా జిల్లాలో రెండు సీట్లు టీడీపీకి దక్కాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మిగతా చోట్ల పార్టీ కేడర్ బలంగా ఉన్న నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో డీలా పడింది. అలాంటి జిల్లాలో పార్టీ ఇప్పుడు కుక్కలు చించిన విస్తరిలా మారింది. ముఖ్యంగా కల్యాణ దుర్గం, శింగనమల నియోజకవర్గాల్లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరిందని సమాచారం.
కల్యాణ్ దుర్గంలో కయ్యాలు..
2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని కాదని, ఉమా మహేశ్వరనాయుడికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో సహజంగానే టీడీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఫలితం వైసీపీ గెలుపు. ఆ తర్వాత కూడా టీడీపీలో నేతల మధ్య సఖ్యత కుదరలేదు. దీనికి కారణం కూడా చంద్రబాబేనని చెబుతారు. సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేయకపోగా.. ఇరు వర్గాలు రెచ్చిపోతున్నా పట్టించుకోవడంలేదు బాబు.
ఇటీవల కల్యాణదుర్గం మండలం కొండాపురంలో టీడీపీ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంలో హనుమంతరాయ చౌదరి వర్గం ఓ విందు ఏర్పాటు చేసింది. నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ ఉమా మహేశ్వరనాయుడికి వ్యతిరేకంగా అక్కడో తీర్మానం చేశారట. లోకల్, నాన్ లోకల్ అనే భావన కూడా తెచ్చారట. దీంతో మరోసారి కల్యాణ దుర్గం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.
శింగనమలలో శిగపట్లు..
ఇక శింగనమల నియోజకవర్గంలో కూడా ఇంటిపోరు ఎక్కువైంది. ఎస్సీ రిజర్వ్ డ్ స్థానం నుంచి శ్రావణి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే అక్కడ రెడ్డి, కమ్మ డామినేషన్ ఎక్కువ.
టీడీపీలోనే ఆ రెండు వర్గాలకు ఇప్పుడు అస్సలు పొసగడంలేదని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమికి కూడా కారణం అంతర్గత పోరేనని తెలుస్తోంది. ఈ గొడవలు మరింతగా ముదరడంతో టీడీపీ నేతలు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికి సిద్ధమయ్యారట. చంద్రబాబు సర్దిచెప్పినా వినడంలేదట.
త్వరలోనే బాబు పర్యటన..
ఇప్పటి వరకూ జూమ్ మీటింగ్ లతోనే నాయకుల్ని, కార్యకర్తల్ని అదిరించి, బెదిరించి, బుజ్జగించిన చంద్రబాబు క్షేత్ర స్థాయికి వెళ్లకపోతే పరిస్థితి దారుణంగా తయారవుతుందని అర్థం చేసుకున్నారు.
త్వరలో అనంతపురం జిల్లా పర్యటనకు ఆయన సిద్ధమవుతున్నారట. పార్టీ అధికారంలో ఉన్న రెండు నియోజకవర్గాలతో పాటు.. అంతర్గత కుమ్ములాటలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ ఆయన పర్యటిస్తారని తెలుస్తోంది.