బీజేపీ నాయకురాలు తుల ఉమ సొంత పార్టీ నేతలపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వేములవాడ టికెట్ ఖరారు చేసి, ఆ తర్వాత తూచ్ అని బీజేపీ అధిష్టానం అన్నది. బీసీ మహిళా నాయకురాలైన తుల ఉమకు కాకుండా మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావుకు టికెట్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ కూడా వేసి, బీ ఫామ్ కోసం తుల ఉమ.. ఈ పరిణామాన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో ఆమె సమావేశం అయ్యారు. ఉమ మాట్లాడుతూ బీజేపీ నాయకులెవరైనా తనకు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానని సంచలన వార్నింగ్ ఇచ్చారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీసీలను అణగదొక్కుతున్నారని, అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్నారని విరుచుకుపడ్డారు. బీజేపీలో మహిళలకు సరైన స్థానం లేదని విమర్శించారు. తనను మోసగించారని వాపోయారు.
చిన్నతనం నుంచే దొరలతో కొట్లాడుతున్నట్టు తుల ఉమ తెలిపారు. బీఆర్ఎస్‌లోని ఓ దొర అహంకారంతో బయటికొచ్చినట్టు ఆమె గుర్తు చేశారు. బండి సంజయ్ దొరల కాళ్ల దగ్గ బీ ఫామ్ పెట్టి వచ్చాడని ఉమ ధ్వజమెత్తారు. దొరల దగ్గర చేతులు కట్టుకుని ఉండలేనని ఆమె తేల్చి చెప్పారు. తన కళ్లలో నీళ్లు తెప్పించారని ఆమె ఆగ్రహించారు. బీజేపీలో బీసీ ముఖ్యమంత్రి అనేది బూటకమని ఆమె అభిప్రాయపడ్డారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని ఉమ తెలిపారు.
ఇదిలా వుండగా ఉమతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు చర్చలు జరుపుతున్నారని సమాచారం. అయితే కాంగ్రెస్ వైపు ఆమె చూపు ఉన్నట్టు తెలిసింది. అందుకే బీఆర్ఎస్‌లో ఒక దొర అహంకారంతో బయటికొచ్చినట్టు చెప్పడం వెనుక, కాంగ్రెస్‌లో చేరుతాననే సంకేతాలు ఇచ్చినట్టైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీని మరింత బలహీనపరుస్తున్నాయనేది వాస్తవం.