అల్లు అరవింద్ నాలుక అటు తిప్పి, ఇటు తిప్పి ఎలాగైనా మాట్లాడొచ్చు. నిర్మాణ వ్యయంలో హీరోల రెమ్యూనిరేషన్ 10 నుంచి 20 శాతం మాత్రమే అని నమ్మించే ప్రయత్నం చేయచ్చు. కానీ హీరోల రెమ్యూనిరేషన్లు రోజు రోజుకు పైకి ఎగబాకుతున్నాయన్నది వాస్తవం.
టాలీవుడ్ జనాలు అందరికీ అది తెలుసు. ఎక్కడో నందమూరి బాలకృష్ణ లాంటి వారు ఒకరిద్దరి విషయం మాత్రమే దీనికి మినహాయింపు. 130 నుంచి 150 కోట్ల బిజినెస్ జరిగే బాలయ్య పాతిక కోట్లు తీసుకుంటే, అదే రేంజ్ బిజినెస్ జరిగే మెగాస్టార్ మాత్రం 50 కోట్లు తీసుకుంటారు.. అంతే బిజినెస్ జరిగే పవర్ స్టార్ 65 కోట్లు తీసుకుంటారని టాలీవుడ్ జనాల్లో వినిపించే సమాచారం. మరి 150 కోట్లకు ఇరవై శాతం అంటే 30 కోట్లే కావాలి కదా అని అరవింద్ ను ఎవరూ అడగరు.
ఇదిలా వుంటే డిజె టిల్లు లాంటి మాంచి హిట్ పడడం, టిల్లు స్క్వేర్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ విడుదలకు రెడీ అవుతుండడంతో, హీరో సిద్దు జొన్నలగడ్డ రెమ్యూనిరేషన్ ఇప్పుడు పది కోట్లకు చేరిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం సిద్దు చేతిలో రెండు ప్రాజెక్టులు వున్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్ లకు పది కోట్ల రెమ్యూనిరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. టిల్లు స్క్వేర్ కనుక బ్లాక్ బస్టర్ అయితే ఇక ఇదే రెమ్యూనిరేషన్ ఎక్కడో వుంటుంది. లక్ అంటే అదే. సరైన బ్లాక్ బస్టర్ ఒక్కటి పడాలి.
గమ్మత్తేమిటంటే హిట్ లు లేని, హిట్ ల కోసం చూస్తున్న శర్వానంద్ కూడా పది కోట్ల రేంజ్ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారని టాక్. ఆ లెక్కన చూస్తే సిద్దు రెమ్యూనిరేషన్ రీజనబుల్ కదా అని కామెంట్ లు వినిపిస్తున్నాయి.