విభజన తర్వాత తీవ్రమైన ఆర్థిక లోటులో రాష్ట్రం కూరుకుపోతే సొంత డబ్బాకు పోయి ఆర్థిక పరిస్థితి భేష్ అంటూ నివేదికలు ఇచ్చారు. ఓవైపు ఉద్యోగాల్లేక యువత అల్లాడుతుంటే తలసరి ఆదాయం సూపర్ అంటూ శ్వేతపత్రం రిలీజ్ చేశారు. తన పరిపాలనలో ప్రజలంతా ఆనందంగా, సంతోషంగా ఉన్నారని.. ఎక్కడా ఎలాంటి సమస్య లేదంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఆ అతి ఇప్పుడు నూతన ముఖ్యమంత్రి జగన్ కు చుట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో అంతా బాగుంది కాబట్టి పన్ను రాయితీలు ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టంచేసింది. ఆర్థికలోటు భర్తీకి సంబంధించిన గడిచిన ఐదేళ్లలోనే నిధులు విడుదల చేశామని ప్రకటించిన కేంద్రం, పన్ను రాయితీలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ కు అర్హత లేదని తెలిపింది. ఈ మేరకు గతంలో చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాల్ని సాక్ష్యాలుగా చూపించింది. చంద్రబాబు తీసుకున్న యూ-టర్న్ ల కారణంగా ఏపీకి ప్రత్యేకహోదా రాకుండా పోయింది.
ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెబుతూ, అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు బాబు. ఆ తర్వాత ప్యాకేజీ వద్దంటూ, హోదానే కావాలంటూ దానికి కూడా మోకాలడ్డారు. ఇలా అటు హోదా, ఇటు ప్యాకేజీ రెండూ రాకుండా చేశారు. కనీసం ప్యాకేజీకి ఓకే చెప్పినా ఈ పాటికి రాష్ట్రానికి పన్నురాయితీలు వచ్చి ఉండేది. మరిన్ని పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఈ రెండింటి విషయంలో చంద్రబాబు గడిచిన ఐదేళ్లలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ఏదీ రాకుండా పోయింది.
అప్పట్లో చంద్రబాబు తీసుకున్న ఆ యూటర్న్ ల ఫలితాల్ని ఇప్పటి సీఎం జగన్ తో పాటు ఏపీ ప్రజలు అనుభవిస్తున్నారు. గతంలో చంద్రబాబు చేసిన ప్రకటనల్ని, విడుదల చేసిన శ్వేతపత్రాల్ని చూపిస్తూ రాష్ట్రానికి ఎలాంటి సహాయం చేయడంలేదు కేంద్రం. ఈ విషయంలో కేంద్రం కాస్త కక్షపూరితంగా వ్యవహరిస్తున్నప్పటికీ, మొదటి తప్పు మాత్రం చంద్రబాబుదే. ఏపీ అనుభవిస్తున్న కష్టాల్ని ఉన్నది ఉన్నట్టుగా కేంద్రానికి నివేదించడంతో పాటు.. విభజన సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రధాని మోదీకి గుర్తుచేస్తే కాస్త ఫలితం ఉండేది.
కానీ కేంద్రంతో పొత్తుతో ఉన్న నాలుగేళ్ల కాలంలో ఎప్పుడూ ఆ పని చేయలేదు చంద్రబాబు. తన స్వలాభం, తన పార్టీ పటిష్టత, తమ నేతలకు కేంద్ర పదవులు, తమ వ్యక్తులకు కాంట్రాక్టులు ఇప్పించుకోవడంపైనే దృష్టిపెట్టారు. అలా ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా గాలికి వదిలేశారు. పైగా తన పాలన బాగుందని చెప్పడం కోసం దొంగ లెక్కలతో శ్వేతపత్రాలు విడుదల చేశారు. గతంలో చంద్రబాబు సృష్టించిన అవ్యవస్థను గాడిలో పెట్టడం ఇప్పుడు జగన్ కు తలకుమించిన భారంగా మారింది.
ఓవైపు ఆర్థిక లోటును పూడ్చడంతో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలకు నిధులు తీసుకురావడం అతిపెద్ద సవాల్ గా మారింది. త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కష్టాలతో ఓ నివేదిక తయారుచేసి ప్రధాని మోడీని కలిసేందుకు సిద్ధమౌతున్నారు జగన్. అదే భేటీలో గతంలో చంద్రబాబు చేసిన జిమ్మిక్కుల్ని ప్రధానికి వివరించి రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు.