ఆ మధ్య భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నాగశౌర్య సినిమా ఆగిపోయింది. నితిన్ కూడా ఓ సినిమాను అలానే పక్కనపెట్టాడు. చాలామంది హీరోల కెరీర్ లో ఇలా ఆగిపోయిన సినిమాలున్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ కెరీర్ లో కూడా ఓ సినిమా ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై హీరో అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఆనంద్ అన్నామళై దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆమధ్య ఢిల్లీలో భారీ ఎపిసోడ్ షూట్ చేశారు. రేసింగ్ కు సంబంధించిన సన్నివేశాల్ని పిక్చరైజ్ చేశారు. దీనికోసం విదేశీ టెక్నీషియన్స్ ను, భారీ ఎక్విప్ మెంట్ ను తీసుకొచ్చారు.
అలా దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తీసిన ఆ సన్నివేశాలు ఎవ్వరికీ నచ్చలేదు. పైగా 10 రోజుల పాటు షూటింగ్ చేసి షాట్స్ తీస్తే, ఎడిటింగ్ లో కేవలం అవి 2 నిమిషాలు మాత్రమే వచ్చాయట. దీంతో ఆనంద్ అన్నామళై డైరక్షన్ పై అందర్లో అనుమానాలు పెరిగాయి.
ఇదే విషయాన్ని విజయ్ దేవరకొండతో చర్చించారు నిర్మాతలు. అతడితో సినిమాను కొనసాగిస్తే మొదటికే మోసం వస్తుందని చెప్పారు. విజయ్ కూడా ఢిల్లీ షెడ్యూల్ విజువల్స్ చూశాడు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ పనిలో ఉన్న ఈ హీరో ఆ సినిమా ప్రమోషన్ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే హీరో సినిమాపై ఓ నిర్ణయం తీసుకోనున్నాడు.
దర్శకుడ్ని మార్చడమా, లేక టోటల్ ప్రాజెక్టును పక్కనపెట్టడమా అనే కోణంలో నిర్ణయం తీసుకుంటారు. కేవలం ఈ సినిమా కోసమే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను కొన్నాళ్లు పక్కనపెట్టాడు విజయ్ దేవరకొండ.