అప్పుడు భూమాలా ఇప్పుడు పయ్యావుల?

పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ.. భారత ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి మంచి ఆయుధం. పీఏసీ చైర్మన్‌గా ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి నియామకం కావడం, ఆ ఎమ్మెల్యే లేదా ఎంపీ వివిధ పథకాలు, ప్రాజెక్టుల అమలును సమీక్షించడం…

పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ.. భారత ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి మంచి ఆయుధం. పీఏసీ చైర్మన్‌గా ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి నియామకం కావడం, ఆ ఎమ్మెల్యే లేదా ఎంపీ వివిధ పథకాలు, ప్రాజెక్టుల అమలును సమీక్షించడం జరుగుతూ ఉంటుంది. పీఏసీని సరిగా ఉపయోగించుకుంటే ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టవచ్చు. అయితే పీఏసీకి సూపర్‌ పవర్స్‌ ఏమీ ఉండవు. అలా తయారుచేసి పెట్టారు ఆ వ్యవస్థను. అయితే పీఏసీ చైర్మన్‌కు క్యాబినెట్‌ ర్యాంక్‌ అనేది మాత్రం నేతలకు బాగా ఇష్టమైనది.

పీఏసీ చైర్మన్‌ పదవి అనేది ప్రతిపక్షంలో ఉన్న నేతలకు ఊరింపు. గత ప్రభుత్వ హయాంలో పీఏసీ చైర్మన్‌ పదవిపై పెద్ద రాజకీయమే జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న ఆ సమయంలో పీఏసీ చైర్మన్‌ పదవి గురించి ఆసక్తిదాయకమైన రాజకీయం జరిగింది. ఆ పదవి కావాలని కొందరు, వద్దని మరి కొందరు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడటం గమనార్హం. ముందుగా పీఏసీ చైర్మన్‌ పదవి భూమా నాగిరెడ్డికి దక్కింది.

మొదటి రెండేళ్లూ ఆ పదవిలో భూమా నాగిరెడ్డి కొనసాగారు. అదే సమయంలో ఆయనపై తీవ్రమైన కక్ష సాధింపు చర్యలు కూడా మొదలయ్యాయి. అప్పటికే హార్ట్‌ పేషెంట్‌ అయిన భూమాను చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. చివరకు ఆ ఒత్తిళ్లు భరించలేక నాగిరెడ్డి పీఏసీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ సమయంలోనే ఆయనకు మంత్రిపదవి హామీ వచ్చిందంటారు. కానీ అదేమీ దక్కలేదు. చివరకు ఆయన మరణించాకా ఆయన కూతురుకు ఆ పదవి దక్కింది. అలాంటి ఫిరాయింపుతో భూమా ఫ్యామిలీ నియోజకవర్గంలో పట్టును కోల్పోయింది.

భూమా నాగిరెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడగానే పీఏసీ చైర్మన్‌గా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరికి దక్కుతుందనేది కూడా చర్చగా నిలిచింది. ఆ అవకాశాన్ని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి ఇచ్చారు జగన్‌. అయితే ఆ పదవిని ఆశించారట గోదావరి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. అప్పటికే శాసనసభలో వైఎస్సార్సీపీ ఉపనేతగా ఉన్న ఆయన పీఏసీ చైర్మన్‌ పదవిని ఆశించారంటారు. అది దక్కలేదని ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా ఏమయ్యారో అందరికీ తెలిసిందే. అలా బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పీఏసీ చైర్మన్‌గా నిలిచారు. ఆయన మళ్లీ ఎన్నికల్లో గెలిచి ఆర్థికశాఖ మంత్రి అయ్యారు.

ఇక తాజాగా చంద్రబాబు నాయుడు పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌కు అవకాశం ఇచ్చారు. ఇప్పటికే పయ్యావుల తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరతారనే ఊహాగానాలున్నాయి. ఇంతలోనే ఆయనకు చంద్రబాబు నాయుడు ఆ పదవిని ఇచ్చారు. అలా పయ్యావులను చంద్రబాబు నాయుడు నియంత్రించుకున్నారనే టాక్‌ వినిపిస్తోంది. పయ్యావుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతారనే అంచనాలున్నాయి.

ఫిరాయింపులా కాకుండా రాజీనామా చేసి చేరే పద్ధతి తప్పనిసరి చేశారు జగన్‌. ఈ నేపథ్యంలో ఇప్పుడు పీఏసీ చైర్మన్‌ పదవికి కూడా రాజీనామా చేస్తారా? అప్పుడు భూమా నాగిరెడ్డి ఫిరాయింపుతో రాజకీయం మొదలైంది, ఇప్పటి పీఏసీచైర్మన్‌ కూడా అలాగే వ్యవహరిస్తారా?

డియర్ కామ్రేడ్ పై దర్శకుడి కష్టాలు

ఈవారం గ్రేట్ ఆంధ్ర స్పెషల్ వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి