ఎన్నికల ముందువరకూ వెంట తిప్పుకున్నారు. మీరే మాకు అంతా.. అని అన్నారు. మీరు లేనిదే మేము లేమన్నారు. మంచిరోజులు వస్తాయన్నారు. ప్రత్యేకించి రాయలసీమలో రాజకీయ ప్రతీకారాలు ఎక్కువ! ఒక పార్టీ అని ముద్రపడింది అని అంటే.. అది శాశ్వతంగా నిలిచిపోతుంది. రాయలసీమ రాజకీయంలో నేతలు పార్టీలు మారిన సందర్భాలు ఉంటాయేమో కానీ, అక్కడి ప్రజల్లో మెజారిటీ మంది ఒకే విధానంతో ఉంటారు. కులాల వారీగా చూసుకున్నా, మరోరకంగా చూసుకున్నా ఒక అజెండాకు కట్టుబడినట్టుగా ప్రజలు ఒక విభజన రేఖను గీసుకుని ఉంటారు.
రాయలసీమ నాలుగు జిల్లాలకూ దాదాపుగా ఈ నియమం వర్థిస్తుంది. అందుకే ఎప్పుడూ ఎన్నికల ఫలితాల్లో రాయలసీమలో మరీ సంచలనాలు ఉండవు. కేవలం ఇటీవలి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనే సంచలన ఫలితాలు వచ్చాయి. తనకు దశాబ్ధాల నుంచి సపోర్టుగా ఉన్న బీసీవర్గాల వెన్ను దన్నును తెలుగుదేశం పార్టీ ఇటీవలే కోల్పోయింది. దీంతో రాయలసీమలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. కేవలం మూడంటే మూడు స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ నెగ్గగలిగింది. అంతటా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగిరింది.
దశాబ్ధాలుగా తెలుగుదేశం పార్టీ కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఈసారి ఆ పార్టీ పరువు నిలుపుకోలేకపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే స్థాయిలో ఫలితాలు వచ్చాయి. రాయలసీమ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను నెగ్గుతుందని చాలామంది అంచనాలు వేశారు కానీ, మరీ ఆ స్థాయిలో సంచలన విజయం సాధిస్తుందని మాత్రం ఎవ్వరూ అనుకుని ఉండరు. ఎన్నికల ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానగణాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.
మరి ఉక్కిరిబిక్కిరి అయ్యే ఆ ఆనందం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానగణానికి ఎక్కువ సేపు నిలవనట్టుగా ఉంది! ప్రత్యేకించి అప్పుడే ఎమ్మెల్యేల తీరుపై చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. అయితే ఆ ఫిర్యాదులను ఎవరికి ఇవ్వాలో అర్థంకాని స్థితిలో ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు. ఒక్క నియోజకవర్గం అని కాదు చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్నికల ఫలితాలు వచ్చి రెండునెలలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తల నుంచి అభిమానవర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతూ ఉండటం గమనార్హం.
కార్యకర్తలు, క్యాడర్ అంటే వాళ్లు జీతాలకు పనిచేసే వాళ్లు కాదు కదా. పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం నుంచినో, ఎమ్మెల్యేల నుంచినో ఏదో లబ్ధిపొందాలనే ఆశలు వారికి ఉంటాయి. వారిలో ఒక్కోరికి ఒక్కోస్థాయి ఆశలు, అంచనాలు. సంక్షేమ పథకాల లబ్ధిపొందాలనో, లేక ప్రభుత్వం ద్వారా మరో రకమైన లబ్ధిపొందాలనే కార్యకర్తలు ఆశిస్తూ ఉంటారు. అది అనుచిత లబ్ధే అని అనుకోనక్కర్లేదు. గతంలో కాంగ్రెస్ హయాంలో తాము ఏదైతే పొందామో, ఇప్పుడు అదేకావాలని వారు అనుకుంటున్నారు.
సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ వారి చేతిలోనే చాలారకాల పదవులు ఉంటాయి. పదవులు అయితేనేం.. కాంట్రాక్టు ఉద్యోగాలు అయితేనేం.. మరోటి అయితేనేం.. అధికారా పార్టీ వైపు ఉన్న వారికి ఆ అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జమానాలో అలాంటి ఊసే లేకుండా పోవడం గమనార్హం!
ఐదేళ్ల కిందట తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రాగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లను తరిమికొట్టారు! ఏ రకమైన అధికారిక వ్యవహారాల్లోనూ వారు వేళ్లు పెట్టడానికి లేకుండా చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్లు. జన్మభూమి కమిటీలంటూ, మరోటి అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలూ, నేతలు ఎవరికి వారు బాస్‌లుగా ఫీలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు అనే వారిని ప్రభుత్వ పథకాల విషయంలో అయితేనేం మరోరకంగా అయితేనేం కనీస లబ్ధి కూడా పొందనివ్వలేదు.
రాయలసీమలో ఈ పోకడ తీవ్రంగా కొనసాగింది. ఈ పరిస్థితిలో అయినా మార్పు వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆశించారు. అయితే ముందు ముందు కథ ఎలా ఉంటుందో కానీ.. ప్రస్తుతానికి అయితే మాత్రం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యేలు తీవ్రంగా అసంతృప్తికి గురి చేస్తున్నారు. తెలుగుదేశం హయాం రాగానే తమ చేతి నుంచి లాక్కొన్న వాటిని అయినా ఇప్పుడు తమకు తిరిగి దక్కేలా చేయమంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేడర్ ఎమ్మెల్యేలను కోరుతూ ఉంది. అయితే వారు మాత్రం మొహంచాటేస్తూ ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో చక్రంతిప్పిన వ్యక్తులే ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతూ ఉన్నారు. ఇన్నిరోజులూ ఎవరి నుంచి అయితే తాము కక్షసాధింపు చర్యలకు గురయ్యామో ఇప్పుడు కూడా వారే చక్రాలు తిప్పుతుండటం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానగణంలో అసహనం కలిగిస్తూ ఉంది. ఇలా కొందరు ఎమ్మెల్యేలు తమ క్యాడర్‌ను పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. పోలింగ్ ముందురోజు వరకూ తాము ఎవరిని అయితే వెంట పెట్టుకుని తిప్పుకున్నామో ఇప్పుడు వారినే పట్టించుకోవడం లేదు. ఇక మరికొందరు ఎమ్మెల్యేలు మహాఘనులు. వాళ్లైతే ఇప్పటివరకూ కనీసం నియోజకవర్గాల వైపు చూడనేలేదు!
ఫలితాలు వచ్చి రెండునెలలు అవుతున్నా ఇప్పటి వరకూ నియోజకవర్గంలో ఇంకా అడుగుపెట్టని ఎమ్మెల్యేలు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వాళ్లు ఎంతసేపూ ఏదో రీజన్లు చెబుతూ బయటబయటే తిరుగుతున్నారు. వారిని కలిసి తమ బాధలు చెప్పుకుందామని కేడర్ వేచి ఉంది. అయితే ఆ ఎమ్మెల్యేలకు మాత్రం ఇంకా నియోజకవర్గ కేంద్రాలకు వచ్చేందుకే తీరిక దొరకడం లేదు.
ఐదేళ్ల కక్షసాధింపు చర్యల నుంచి ఉపశమనం లభిస్తుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కేడర్ తీవ్రంగా ఆశలు పెట్టుకుంటే.. ఇప్పుడేమో ఆ పరిస్థితి లేకపోవడం వారి మధ్యనే చర్చనీయాంశంగా మారింది. మరి ముందు ముందు అయినా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందా? లేక యథాతథ స్థితి కొనసాగుతుందా? అనేది కూడా చర్చనీయాంశంగా నిలుస్తోంది.