ఆంధ్ర సిఎమ్ జగన్ సినిమా హీరో బాలకృష్ణ ఫ్యాన్ అని ప్రచారంలో వుంది. ఆ అభిమానం నేపథ్యంలోనే కీలక సమయంలో బాలయ్యను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆదుకున్నారనీ అంటారు. అదేమో కానీ బాలయ్య బాబే ఆంధ్ర సిఎమ్ జగన్ అభిమాని అనిపిస్తోంది.
వైద్య విశ్వ విద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మారిస్తే, దాన్ని చాలా పెద్ద సమస్యగా మార్చే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్షంగా దానికి అదో అవకాశం. అందువల్ల తప్పు పట్టడానికి లేదు. చాలా మంది జగన్ అభిమానులు కూడా ఇలా ఎందుకు చేసినట్లు అని అనుకున్నారు కూడా.
ఈ సమస్యతో జగన్ ఇరుకున పడతారు అనుకున్న టైమ్ లో రెండు స్టేట్ మెంట్లు మొత్తం ఇస్యూను పక్కకు తీసుకెళ్లిపోయాయి. అందులో కీలకమైనది బాలకృష్ణ స్టేట్ మెంట్. ‘మా బ్లడ్..మా బ్రీడ్ వేరు’ అని గతంలోనే ఓ ఛానెల్ ఇంటర్వూలో బాలకృష్ణ అనడం ఇప్పటికీ మిగిలిన సామాజిక వర్గాలను మండిస్తూనే వుంటుంది. ప్రత్యేకించి ఓ వర్గం మా బ్లడ్ వేరు..టైపు మాటలు మాట్లాడితే మిగిలిన వారికి సహజంగానే మండుకు వస్తుంది.
అదే టైపులో ఈసారి కూడా బాలకృష్ణ స్టేట్ మెంట్ పడేసారు. తెలుగుజాతికే అవమానం, తెలుగు జాతి..నాగరికత…యుగపురుషుడు అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. పేరు మార్చడం తప్పు, సరికాదు అంటే సరిపోయేది. అలా కాకుండా ఎన్టీఆర్ నే తెలుగుజాతి. ఎన్టీఆర్ నే తెలుగు గౌరవం అనేసరికి, అనేక పాత గాయాలు కెలికినట్లు అయింది. ఎన్నో సామాజిక వర్గాల మండుకొచ్చింది. మొత్తం ఒంటి కాలిపై లేచారు. పాత వీడియోలు, సంఘటనలు, కటింగ్ లు అన్నీ వెలికి తీసారు. మొత్తం ఇస్యూ డైవెర్ట్ అయిపోయింది.
ముచ్చటగా మూడు రోజులు ముగిసే సరికి వ్యవహారం ముగిసిపోయింది. థాంక్స్ టు బాలయ్య అనుకోవాలేమో జగన్.