సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి భార్య వైఎస్ భారతి, టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి పేర్ల మీదుగా పెద్ద యుద్ధమే జరుగుతోంది.
టీడీపీ సోషల్ మీడియా అనవసరంగా వైఎస్ భారతి పేరును తెరపైకి తెచ్చి, తమ నాయకులు చంద్రబాబు, లోకేశ్ జీవిత భాగస్వాములను అభాసుపాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైఎస్ భారతి పేరును టీడీపీ అనవసరంగా లాగిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో లిక్కర్ సొమ్మును వైఎస్ భారతి పేరుతో చెల్లించాలంటూ వైఎస్ భారతి పే పేరుతో ఓ ఫోన్ పే క్యూఆర్ కోడ్‌ను ఆమె ఫొటోతో సహా టీడీపీ సోషల్ మీడియా క్రియేట్ చేసింది. దీన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టింది. దీనికి కౌంటర్‌గా వైసీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్‌గా బదులిస్తోంది.
నారా బ్రాహ్మణి పేరుతో డబ్బు చెల్లించాలంటూ ఆమె పేరు, ఫొటోతో సహా క్యూఆర్ కోడ్‌ను రూపొందించి వైసీపీ సోషల్ మీడియా భారీగా ట్రోల్ చేస్తోంది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతటితో వైసీపీ ఆగలేదు. భువనేశ్వరిని, లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి, తదితరులను కూడా తెరపైకి తేవడం గమనార్హం.
దీంతో టీడీపీ సోషల్ మీడియా నాలుక్కరుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీతో అనవసరంగా గొడవ పెట్టుకుంటే ఎలా వుంటుందో ఆ పార్టీ సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియాకి రుచి చూపిస్తోంది.
భారతిని లాగడంతో వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి బుద్ధి చెప్పడానికి సంస్కారం మరిచి కూడా కొన్ని అభ్యంతరకర పోస్టులను క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. దీనికి టీడీపీ సోషల్ మీడియానే బాధ్యత వహించాల్సి వుంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఇదిలా వుండగా మహిళలను సోషల్ మీడియాలో కించపరిచే చెడు సంప్రదాయానికి ఎప్పుడు ముగింపు పలుకుతారో అనే చర్చ నడుస్తోంది.