మెగాస్టార్ కాంగ్రెస్ ను ఎందుకు వదులుకోలేదు?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల గురించి రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఆయన రాజకీయాల్లో ఉన్నాడా అని ప్రశ్నించుకుంటే ఉన్నాడని చెప్పొచ్చు. పాలిటిక్స్ లో లేడా అని ప్రశ్నించుకుంటే లేడని చెప్పొచ్చు. ఆయన సొంత పార్టీ పెట్టుకొని…

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల గురించి రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఆయన రాజకీయాల్లో ఉన్నాడా అని ప్రశ్నించుకుంటే ఉన్నాడని చెప్పొచ్చు. పాలిటిక్స్ లో లేడా అని ప్రశ్నించుకుంటే లేడని చెప్పొచ్చు. ఆయన సొంత పార్టీ పెట్టుకొని ఎన్నికల్లో విఫలమయ్యాక కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహం ప్రకారం ఆయన పార్టీని రద్దు చేయించి తనలో విలీనం చేయించుకుంది. అందుకు ప్రతిఫలంగా ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. ఈ కథ అందరికీ తెలిసిందే. 2014 లో కూడా యూపీఏ అధికారంలోకి వచ్చివుంటే చిరంజీవి రాజకీయ జీవితం కంటిన్యూ అయ్యేదేమో. ఎప్పుడైతే అది జరగలేదో అప్పుడే ఆయన రాజకీయాలకు దూరమయ్యాడు. సినిమా రంగానికి దాదాపు పదేళ్లు దూరంగా ఉన్నానని బాధపడ్డాడు.

నిజానికి చిరంజీవి ఎన్నికల్లో పూర్తిగా విఫలం కాలేదు. 18 సీట్లు వచ్చాయి. కానీ తాను సీఎం కావాలని అనుకున్నాడు. ఆ కోరిక నెరవేరకపోవడంతో డీలా పడిపోయాడు. రాజకీయాలపట్ల సీరియస్ నెస్ లేదు. ఈమధ్య  చిరంజీవి విడుదల చేసిన ఒక ఆడియో సందేశం పొలిటికల్ సర్కిల్స్ పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. అది చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ లో డైలాగ్. కానీ, ఆయన రాజకీయ యాత్రకు సరిగ్గా సరిపోయిన డైలాగ్ కావటం..ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆ ఆడియో సందేశం ప్రకంపనలకు కారణమైంది. ఆ వీడియో సందేశం లో చిరంజీవి.. “నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ, రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు”..అని చెప్పుకొచ్చారు.

చిరంజీవి చెప్పింది ఒకవిధంగా నిజమే. ఆయన్ని మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ చేయాలని ఏపీ కాంగ్రెస్ ప్రయత్నాలు చేయగా, ఆయన్ని బీజేపీలో చేర్చుకొని ఆయన ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేసింది. కానీ చిరంజీవి అవకాశం ఇవ్వలేదు. అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నాడేమోగానీ కాంగ్రెస్ పార్టీకి దూరంగా లేడని చెప్పొచ్చు. చిరంజీవి వ్యక్తిగతంగా పార్టీకి దూరంగా ఉండొచ్చు. కానీ సాంకేతికంగా దూరంగా లేడు. అందుకు కారణం సరిగ్గా తెలియదు. 2014 పరిణామాల తరువాత ఆయన కాంగ్రెస్ కు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కానీ, పార్టీకి అధికారికంగా రాజీనామా చేయలేదు.

అంటే కాంగ్రెస్ లో ఉన్నట్లే కదా. చిరంజీవి డైలాగ్ ఆడియో విడుదల అయిన తరువాత అనూహ్యంగా కాంగ్రెస్ నేతలకు చిరంజీవి గుర్తుకు వచ్చాడు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా చిరంజీవిని పీసీసీ డెలిగేట్ గా 2027 వరకు కొనసాగిస్తూ కొత్తగా సీడబ్ల్యూసీ ఎన్నికల విభాగం ఒక కార్డు జారీ చేసింది. పశ్చిమ గోదావరి కోవూరు నియోజకవర్గంలో చిరంజీవికి బాధ్యతలు కేటాయించారు. ఆల్రెడీ పీసీసీ డెలిగేట్ గా ఉన్న చిరంజీవిని మరోసారి బాధ్యతలు కొనసాగిస్తూ ఈ నిర్ణయం జరిగింది. కానీ దీని పైన చిరంజీవి స్పందించ లేదు. రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని చెబుతున్నాడు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని లేదా బయటకు వస్తున్నానని మాత్రం స్పష్టత ఇవ్వటం లేదు.

దీంతో, కాంగ్రెస్ నేతలు చిరంజీవి ఇంకా తమతో ఉన్నారనే అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు తన డైలాగ్ బయటకు వచ్చాక జరిగిన రాజకీయ చర్చ పైన చిరంజీవి స్పందించాడు. తన ఆడియో ఇంతలా చర్చకు దారి తీస్తుందని తాను ఊహించలేదని చెప్పాడు. అది కూడా మంచిదే అంటూ వ్యాఖ్యానించాడు. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నపుడు రాష్ట్రం విడిపోయినా చిరంజీవి మంత్రి పదవికి రాజీనామా చేసి నిరసన తెలపలేదు. రాష్ట్రం విడిపోయాక ఏపీకి కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపైనర్ గా ప్రచారం చేశాడు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదు. ఆ తరువాతే సినిమా రంగంలోకి రీఎంట్రీ ఇచ్చాడు.

చిరంజీవి పొలిటికల్ డైలాగ్ తరువాత ఆయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతాడని కొందరు అంటుంటే, దూరంగానే ఉంటాడని కొందరు అభిప్రాయపడుతున్నారు.