విజయ్ మీరు కొంచెం మారాలి?

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లేటెస్ట్ యువ సంచలనం. యూత్ లో అతి భయంకరమైన ఫాలోయింగ్ వుంది. అది అంగీకరించాల్సిన వాస్తవం. కానీ అదే సమయంలో టాలీవుడ్ లో విజయ్ మీద విపరీతమైన కనిపించని అసూయ…

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లేటెస్ట్ యువ సంచలనం. యూత్ లో అతి భయంకరమైన ఫాలోయింగ్ వుంది. అది అంగీకరించాల్సిన వాస్తవం. కానీ అదే సమయంలో టాలీవుడ్ లో విజయ్ మీద విపరీతమైన కనిపించని అసూయ వుంది అన్నది కూడా అంతే వాస్తవం. ఒక హీరో సినిమా విడుదల అవుతుంటే, మరో హీరో ఫ్యాన్స్ నో, ఆ హీరో వర్గమో కాస్త నెగిటివ్ గా ఫీల్ కావడం, ప్రాపగండా చేయడం కామన్. కానీ దాదాపు టాలీవుడ్ లో మూడువంతుల మంది నెగిటివ్ గా ఫీల్ కావడం అన్నది అరుదు.

పైకి ఎవ్వరూ పెదవి విప్పకపోయినా, నిన్నటికి నిన్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా డియర్ కామ్రేడ్ ఫలితం చూసి, టాలీవుడ్ లో మూడువంతుల మంది చంకులు గుద్దుకున్నారన్నది నమ్మి తీరాల్సిన నిజం. పైకి ఎవ్వరూ ఒప్పుకోకపోవచ్చు, కానీ టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిళ్లలో నిన్నటికి నిన్న జరిగింది ఇధే. విజయ్ కు ఆటిట్యూడ్ ఎక్కువ, ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ లా ఫీల్ అయిపోతున్నాడు, అతి తగ్గించుకోవాలి. ఆ మ్యూజిక్ ఫెస్టివల్స్ అంటూ అంత హడావుడి ఏమిటి? అయినా నాలుగు భాషల్లో అప్పుడే ఎంట్రీ అవసరమా? ఇలా ఒకటికాదు, రెండుకాదు, ఎన్ని కామెంట్ లు వినిపించాయో?

ఈ కామెంట్లకు తగినట్లేవుంది విజయ్ వ్యవహారం కూడా. మీడియా మీద సెటైర్లు వేయడం, ప్రెస్ మీట్ లో మీడియాతో ముచ్చటించినపుడు వెటకారంగా మాట్లాడడం, తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్ కు విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చి, తెలుగులో ఒక్క న్యూస్ చానెల్ కు కానీ, ఎవరికీ కానీ ఎటువంటి ఇంటర్వూలు ఇవ్వకపోవడం, ఇలా అన్నివిధాలా అన్ని వర్గాలను విజయ్ దూరం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

సినిమారంగంలో అందరి హీరోలతో సినిమాలు చేస్తున్న ఓ పెద్ద ప్రొడ్యూసర్, ఇండస్ట్రీ కీలకవ్యక్తి విజయ్ తో కూడా సినిమా చేద్దామని అడిగితే, ఎస్ ఆర్ నో చెప్పకుండా రోజుల తరబడి తిప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన విసిగిపోయి, ఇలా ఏ హీరోను చూడలేదు ఇంతవరకు అని కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఫ్యాన్స్ సంగతి చెప్పనక్కరలేదు. విజయ్ కనుక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ చేసుకుంటే, నేరుగా టాప్ లైన్ హీరోల పక్కన వచ్చి కూర్చుంటాడు అన్న అభిప్రాయం ఒకటి స్ప్రెడ్ అయింది. దాంతో ఎవరి శక్తి కొలది వారు వార్తలు వ్యాప్తిచేసారు.

ఇక విజయ్ కూడా తక్కువ తిన్నట్లు లేదు. డియర్ కామ్రేడ్ సినిమాను దాదాపు విజయ్ నే అన్నీ దగ్గర వుండి చేసుకున్నాడు అన్న వార్తలు వున్నాయి. షూటింగ్ లో ఏం జరుగుతుందో ఇట్టే బయటకు వస్తుంది. డైరక్టర్ ను పక్కన కూర్చోపెట్టి, స్క్రిప్ట్ కాగితాలు పట్టుకుని విజయ్ నే అందరికీ అన్నీ చెబుతున్నాడు అన్న వార్తలు పలువురు ఆర్టిస్టుల ద్వారా బయటకు వచ్చాయి. విశాఖ సభలో సుహాస్ లాంటి ఆర్టిస్లులు కూడా విజయ్ అన్న కేరవాన్ లో సీన్ల మీద పూర్తిగా డిస్కస్ చేసి, మమ్మల్ని ప్రిపేర్ చేసేవాడు అని ఓపెన్ గా చెప్పారు.

టాలీవుఢ్ లో ఎదిగిన కొద్ది ఒదిగి వుండడం అన్నది ఓ ఆనవాయితీ. కానీ విజయ్ కు స్వతహాగా వుండే బాడీ స్టయిల్ కాస్తా ఆటిట్యూడ్ గా కనిపిస్తోంది అందరికీ. దానికి తగినట్లే వుంది అతని వ్యవహార శైలి కూడా. ఇవన్నీ కలిసి, టాలీవుడ్ లో విజయ్ కు కనిపించని శతృవుల సంఖ్య అమాంతం పెంచేస్తున్నాయి.

ఇక్కడ పైకి సర్రున రైజ్ కానీ హీరోలు అంటూ ఎవ్వరూలేరు. ఉదయ్ కిరణ్, తరుణ్ నుంచి టాప్ లైన్ వరకు అందరూ ఒక స్టేజ్ లో సర్రున లేచినవారే. కానీ నిలబడ్డవాళ్లు, నిలబెట్టుకున్నవాళ్లు, నిలదొక్కుకున్నవాళ్లు కొద్దిమందే. అలాంటి వాళ్ల వెనుక వాళ్ల ప్లానింగ్, వ్యవహార శైలి, ఇతరత్రా వ్యవహారాలు వుంటాయి. విజయ్ కూడా అలాంటివి కొంచెం అలవర్చుకోవడం అవసరం అన్న సలహాలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

డియర్ కామ్రేడ్.. విజయ్ జోక్యం నిజంగా ఉందా?

సినిమా రివ్యూ: డియర్‌ కామ్రేడ్‌