జగన్ సత్తా ఏంటో ఉగాదికి తెలుస్తుంది

పేదవారికి వైఎస్ఆర్ సర్కార్ ఇందిరమ్మ గృహాలను కట్టించి ఇచ్చింది, చంద్రబాబు షీర్ వాల్ టెక్నాలజీ అంటూ ఊదరగొట్టి ఎన్టీఆర్ గృహసముదాయాలను తీసుకొచ్చారు. ప్రభుత్వాలు మారినా, పథకాల పేర్లు మారినా అంతిమంగా ప్రజలు మాత్రం ఉచితంగా…

పేదవారికి వైఎస్ఆర్ సర్కార్ ఇందిరమ్మ గృహాలను కట్టించి ఇచ్చింది, చంద్రబాబు షీర్ వాల్ టెక్నాలజీ అంటూ ఊదరగొట్టి ఎన్టీఆర్ గృహసముదాయాలను తీసుకొచ్చారు. ప్రభుత్వాలు మారినా, పథకాల పేర్లు మారినా అంతిమంగా ప్రజలు మాత్రం ఉచితంగా ఇస్తున్న ఇళ్ల విషయంలో నూటికి 50శాతం కూడా సంతోషంగా లేరు అనే విషయం వాస్తవం. ఈ దశలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే.. ఉగాది నాటికి 25లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని మాటిచ్చారు జగన్. ఇల్లు కట్టించి ఇస్తామని వాయిదాలు వేసుకుంటూ, టెండర్లతో అవినీతిని ప్రోత్సహించుకుంటూ వెళ్లకుండా ఇలా నేరుగా ఇళ్ల పట్టాలు చేతికి ఇస్తామని చెప్పడం నిజంగా సాహసోపేతమైన నిర్ణయమే. అందులోనూ జగన్ కి క్షేత్రస్థాయి సమస్యలు పూర్తిగా తెలుసు. ఇళ్ల పట్టాల విషయంలో లబ్ధిదారులు పడే అవస్థలూ ఆయనకి బాగా ఎరుక.

రెవెన్యూ శాఖ ఒకరికి పట్టా ఇచ్చిందంటే, దానికి సరైన సరిహద్దులు వెతుక్కోవడం తలకు మించిన పని. ఒకచోట స్థలమిస్తారు, ఇంకోచోట వెతుక్కోమంటారు, తీరా అక్కడికి వస్తే, అది అప్పటికే ఇంకెవరికో ఇవ్వడమో, మరేదైనా పనికి ఉపయోగించుకుంటూ ఉండటమో జరుగుతూ ఉంటుంది. పక్కాగా అన్నీ క్లియర్ గా ఉన్న ప్రభుత్వ స్థలం దక్కాలంటే నక్కతోక తొక్కాల్సిందే. ఈ సమస్యలు తెలుసు కాబట్టే జగన్ వివాదాలకు తావులేకుండా స్థలాలు కొనుగోలు చేసైనా సరే పేదలకు కేటాయించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయి ఉగాదినాటికి 25లక్షలమందికి ఇళ్ల పట్టాలు అందుతాయి.

ఈ పట్టాల విషయంలోనే జగన్ సమర్థత ఏంటి అనేది తెలుస్తుంది. గ్రామ వాలంటీర్లయినా, గ్రామ సచివాలయాలైనా.. వాటి పనితీరు తెలుసుకోవాలంటే కాస్త టైమ్ పడుతుంది, అమ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాలు కేవలం ఆర్థిక లబ్ధిని చేకూర్చేవి మాత్రమే కాబట్టి దానికి బడ్జెట్ కేటాయింపులే గీటురాయి. అయితే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం, అందులోనూ ఒకేసారి 25లక్షల మందికి లబ్ధి చేకూరుస్తామని డెడ్ లైన్ పెట్టుకోవడం జగన్ కే కాదు, అధికారులకూ అగ్నిపరీక్షే. దీనికి సంబంధించి ఇప్పటికే కమిటీ వేసిన ప్రభుత్వం ఆర్థిక, సామాజిక సంక్షేమ, గృహనిర్మాణ శాఖ కార్యదర్శులను సభ్యులుగా నియమించింది.

ఉగాది టార్గెట్ గా పెట్టుకున్న జగన్ 25లక్షల మందిని సంతోషపెట్టి తన ప్రభుత్వ సమర్థతను తెలియజేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఎలా చేస్తారో చూద్దామని అటు ప్రతిపక్షాలు కూడా ఎదురు చూస్తున్నాయి. మొత్తానికి జగన్ సర్కార్ మొదటి సెమిస్టర్ ఫలితాలు ఉగాదికి వెలువడబోతున్నాయన్నమాట.

డియర్ కామ్రేడ్.. విజయ్ జోక్యం నిజంగా ఉందా?

సినిమా రివ్యూ: డియర్‌ కామ్రేడ్‌