రాజకీయ పార్టీలు ఎప్పుడూ ఏవో ప్రయోగాలు చేస్తూనే ఉంటాయి. పార్టీ బలాన్ని బట్టి, అప్పుడున్న రాజకీయ పరిస్థితిని బట్టి ఒంటిరిగా పోటీచేయడమో, భావసారూప్యత ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగడమో చేస్తుంటాయి. సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ ప్రయోగాలు జరుగుతుంటాయి. ఈ ప్రయోగాలు సరైన ఫలితాలు ఇవ్వొచ్చు లేదా వికటించవచ్చు. అంచనా వేయడం కష్టం. దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న పార్టీలు కూడా పొత్తు పెట్టుకోవడం రాజకీయాల్లో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఓ నిర్ణయం తీసుకుంది. ఏపీలో త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీ చేయాలనేది ఆ నిర్ణయం. ఈ విషయం పార్టీ నాయకుడు, పవన్ సోదరుడు నాగబాబు చెప్పాడు.
అసెంబ్లీ, లోకసభ ఎన్నికల తరువాత జనసేన పోటీచేయబోయే రెండో ఎన్నికలు స్థానిక సంస్థలకు సంబంధించినవి. పవన్ కళ్యాణ్‌కు హీరోగా ఉన్న ఇమేజ్‌కు ఆయన పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని కొందరు విశ్లేషకులు అనుకున్నారు. కాని ఆయన కమ్యూనిస్టు పార్టీలతో, బీఎస్పీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగారు. ఏపీలోగాని, తెలంగాణలోగాని కమ్యూనిస్టు పార్టీలకు ఒంటరిగా ఎన్నికల్లో పోరాడే శక్తిసామర్థ్యాలు లేవు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే పవన్ ఇమేజ్ కారణంగా కొన్ని సీట్లయినా సాధించుకోవచ్చని ఆ పార్టీలు భావించాయి. బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే బడుగు బలహీనవర్గాల ఓట్లు పడతాయని పవన్ భావించాడు. యూపీ వెళ్లి ప్రత్యేకంగా మాయావతిని కలిసి ఏపీలో ఉనికిలోనే లేని బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు.
చివరకు అన్ని పార్టీలూ దారుణంగా దెబ్బతిన్నాయి. ఇలా పవన్ చేసిన పొత్తుల ప్రయోగం విఫలమైంది. అందుకే స్థానిక సంస్థల్లో ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావడంలో భాగంగానే తాజాగా పొలిట్‌బ్యూరోను, పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రకటించినట్లుగా ఉంది. నలుగురితో పొలిట్‌బ్యూరోను, 12 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని పవన్ ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాడనే వార్తలు వస్తున్నప్పుడల్లా పార్టీ నిర్మాణానికి సంబంధించి ఏదో ఒక పనిచేస్తున్నాడు. దీంతో ఆయన పార్టీపైనే పూర్తిగా దృష్టిపెట్టాడని, సినిమాల్లోకి వెళ్లడనే అభిప్రాయం కలుగుతోంది. ఈమధ్యనే సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తిరిగి సినిమాల్లో నటించాలని పవన్‌కు సలహా ఇచ్చారు.
ఆ వార్త రాగానే ఈయన పొలిట్‌బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రకటించాడు. ఇక ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు అసెంబ్లీలోనూ, బయటా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాని పవన్ ఏమీ మాట్లాడటంలేదు. ఏ పరిణామాలపై జనసేన స్పందన ఏమిటో తెలియడంలేదు. తాజాగా నాగబాబు 'వైఎస్సార్సీపీకి ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి మంచిగా పరిపాలించాలి' అని ఓ సలహా ఇచ్చాడు. టీడీపీయేమో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ఉతికి ఆరేస్తోంది. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చ జరపడం కంటే టీడీపీ-వైకాపా పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడమే సరిపోతోంది. జగన్ తీసుకుంటున్న విధాన నిర్ణయాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రభావం చూపుతాయి.
ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల్లో గెలుపు కోసం జనసేన చేసే వ్యూహరచన ఎలా ఉంటుందో తెలియాలి. స్థానిక సంస్థలను కైవసం చేసుకోవడం కంటే ముందుగా వాటిల్లో ప్రవేశించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ అభిప్రాయపడుతున్నాడు. ఇక టీడీపీ స్థానిక సంస్థల్లో పాగావేయాలనే లక్ష్యంతో ఉంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి ఉపశమనం పొందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలని భావిస్తోంది. బీజేపీ కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతోఇంతో సత్తాచాటాలని ఆ పార్టీ అనుకుంటోంది. ఈ ఎన్నికలను ఏ పార్టీ కూడా తేలిగ్గా తీసుకోవడంలేదు. కాబట్టి జనసేన కూడా గట్టిగా కసరత్తు చేసి ఒంటరి పోరులో సత్తా నిరూపించుకోవల్సిన అవసరముంది.