సినీనటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి రాజీనామాపై డ్రామాకు తెరపడినట్టే. ఎట్టకేలకు తాను టీడీపీ నుంచి నిష్క్రమించినట్టు ఆమె రెండోసారి ప్రకటించారు. అయితే టీడీపీ నుంచి తాను బయటికి రావాల్సిన పరిస్థితులపై ఆమె నిజాలు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఏవండోయ్ నానీ గారు అంటూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై సినీ డైలాగ్‌తో విమర్శలు చేసి అందరి దృష్టిని ఆమె ఆకర్షించారు.
టీడీపీ వాయిస్‌ను అప్పుడప్పుడు దివ్యవాణి వినిపిస్తున్నా, బయటికి చెప్పుకోలేని అసౌకర్యాన్ని ఆమె ఎదుర్కొంటున్నారని సమాచారం. టీడీపీలో కొందరి ప్రవర్తన బయటికి చెప్పుకోలేని రీతిలో అభ్యంతరకరంగా వుందనే చర్చకు తెరలేచింది. రెండు రోజుల క్రితం ట్విటర్ వేదికగా రాజీనామా ప్రకటనలో ‘తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ పార్టీకీ రాజీనామా చేస్తున్నా’ అని పేర్కొనడం వెనుక… దివ్యవాణి చాలా పెయిన్‌ను భరించిందని సహచర అధికార ప్రతినిధులు ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నారు. అయితే దాన్ని ఆమె బయటికి చెప్పుకోడానికి ఇబ్బంది పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
టీడీపీలో సినిమా వాళ్లు ఇమడలేకపోతున్నారని, ఇలా అనేక అంశాలపై ఆమె మనసులో మాటను ఇటీవల బయట పెట్టారు. అయితే దివ్యవాణి నోరు తెరిచి నిజాలు మాట్లాడితే… టీడీపీ పునాదులు కదిలిపోయే ప్రమాదం ఉందనే భయం ఆ పార్టీలో లేకపోలేదు. తాజా రాజీనామా ప్రకటనలో కూడా దివ్యవాణి తన మార్క్ వ్యంగ్యాన్ని జోడించడం గమనార్హం. చంద్రబాబుతో నిన్న భేటీ తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడాన్ని గమనించొచ్చు.
‘అయ్యో.. లోపల మర్యాదలు తట్టుకోలేకపోయాను. యదార్థ స్థితిని భరించలేకపోయా’ అంటూ దెప్పి పొడిచారు. నిజాల్ని నిర్భయంగా మాట్లాడ్తారనే పేరు దివ్యవాణి సొంతం. టీడీపీలో మహిళల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఆమె వాస్తవాల్ని సమాజం ముందు ఉంచాల్సిన తరుణం ఆసన్నమైంది.
మొన్న సాదినేని యామినీశర్మ, నేడు దివ్యవాణి, రేపు వంగలపూడి అనిత, తొడగొట్టే గ్రీష్మ …ఇలా ఎవరైనా బాధితులుగా మిగిలే ప్రమాదం ఉంది. కావున దుష్టశక్తుల బారిన మరింత మంది మహిళా నేతలు పడకుండా ఉండాలంటే దివ్యవాణి నోరు విప్పాలి. నిప్పులాంటి నిజాలు బయటికి రావాలి.
ఇది కేవలం తనకు జరిగిన అవమానంగా దివ్యవాణి చూడకూడదు. టీడీపీలో మహిళలకు జరుగుతున్న పరాభవంగా చూడాలి. సమాజ శ్రేయస్సును, రాజకీయాల్లో మహిళల పురోగతిని దృష్టిలో పెట్టుకుని , తనదైన రీతిలో దివ్యవాణి గళమెత్తాలి. నిజాలు మాట్లాడకపోతే టీడీపీ తనపై నిందలు వేస్తుందనే వాస్తవాన్ని గ్రహించాలి. ఈ నేపథ్యంలో తనను తాను బలి పెట్టుకుని, నిజాల్ని సమాధి చేస్తారా? లేక మహిళంటే కాళికాశక్తి అని నిరూపించుకుంటారా? అనేది దివ్యవాణి చేతిలోనే ఉంది.