ఇన్నాళ్లూ వరుసగా పెద్ద సినిమాలొచ్చాయి. ఆ స్టార్ డమ్, ఆ క్రేజ్.. ఆ లెక్క వేరు. దాంతో వసూళ్లు వచ్చేశాయి. టాలీవుడ్ గాడిన పడిందని అంతా అనుకున్నారు. మొత్తం సెట్ అయిపోయిందని కూడా కొందరన్నారు. కానీ అసలైన కొలమానం అది కాదు. ఈ నెల నుంచి మిడ్ రేంజ్ మూవీస్ వస్తున్నాయి. వీటికి కూడా ఆడియన్స్ రావాలి. ఫుట్ ఫాల్ పెరగాలి. అప్పుడు టాలీవుడ్ గాడిన పడినట్టు అర్థం.
ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయిందనే విశ్లేషణలు కొన్ని నెలలుగా వినిపిస్తున్నాయి. లార్జర్ దేన్ లైఫ్, భారీ వినోదం ఉన్న చిత్రాలను మాత్రమే థియేటర్లలో చూడ్డానికి ఆడియన్ ఇష్టపడుతున్నాడనే వాదన ఉంది. ఏమాత్రం బజ్ లేకపోయినా, మిడ్-రేంజ్ సినిమా అయినా లైట్ తీసుకుంటున్నాడట, ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడట. ఈ వాదనలో నిజం ఎంతనేది ఈ నెలలో తేలిపోతుంది.
మేజర్, అంటే సుందరానికి, విరాటపర్వం.. ఇలా అన్నీ మీడియం రేంజ్ సినిమాలే. పవన్, ప్రభాస్, మహేష్ రేంజ్ లో ఈ హీరోలకు క్రేజ్ లేదనేది వాస్తవం. కేవలం తమ కంటెంట్ తోనే వీళ్లు ప్రేక్షకుల్ని థియేటర్లకు ఆకర్షించాలి. అయితే ఇక్కడ అసలైన సమస్య ఉంది. కంటెంట్ బాగుందని తెలిసినా అశోకవనంలో అర్జున కల్యాణం లాంటి సినిమా చూసేందుకు జనాలు థియేటర్లకు వెళ్లలేదు.
నాని, రానా, అడివి శేష్ సినిమాలకు కూడా అదే పరిస్థితి ఎదురౌతుందా? కంటెంట్ క్లిక్ అయినప్పటికీ జనాలు ఈ సినిమాలు చూడ్డానికి థియేటర్లకు రారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ నెలలో తేలిపోతుంది. ముందుగా ఈ పరీక్షను ఎదుర్కోబోయే సినిమా మేజర్.
ఆల్రెడీ ఈ సినిమాకు ప్రధాన అడ్డంకిగా ఉన్న టికెట్ రేట్లను భారీగా తగ్గించారు. ఇంకా చెప్పాలంటే మల్టీప్లెక్సులో దిల్ రాజు చెబుతున్న సాధారణమైన రేటు కంటే వంద రూపాయలు తక్కువకే మేజర్ సినిమాను చూసే వెసులుబాటు ఉంది. కాబట్టి కంటెంట్ బాగుంటే, థియేటర్లకు వెళ్లడానికి ప్రేక్షకులకు టికెట్ రేటు అడ్డంకి కాదు. అప్పటికీ థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరగకపోతే మాత్రం ఆలోచించుకోవాల్సిందే.
మేజర్ సినిమా రిజల్ట్ చూసి విరాటపర్వం, అంటే సుందరానికి సినిమాలు తమ స్ట్రాటజీలు మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ సినిమాల సంగతి పక్కనపెడితే.. ఓవరాల్ గా, సగటు ప్రేక్షకుడు లేదా ఓ మధ్యతరగతి కుటుంబం థియేటర్ల వైపు వస్తున్నారా లేదా అనేది ఈ నెలలో తేలిపోతుంది. సిసలైన ఫుట్ ఫాల్ లెక్కలు బయటపడేది కూడా ఈ నెల్లోనే.