దిగు దిగు నాగ‌.. మరి ఆ పాటల సంగ‌తేంటి?

'వ‌రుడు కావ‌లెను' అనే సినిమాకు సంబంధించి ఐట‌మ్ సాంగ్ త‌ర‌హా పాట‌పై ఫిర్యాదులు న‌మోద‌య్యాయి. ఈ పాట ర‌చ‌యిత అనంత శ్రీరామ్ పై బీజేపీ వాళ్లు ఫిర్యాదు చేశార‌ట‌.  ఈ పాట నాగ‌దేవ‌త‌ను, సుబ్ర‌మ‌ణ్య‌స్వామిని…

'వ‌రుడు కావ‌లెను' అనే సినిమాకు సంబంధించి ఐట‌మ్ సాంగ్ త‌ర‌హా పాట‌పై ఫిర్యాదులు న‌మోద‌య్యాయి. ఈ పాట ర‌చ‌యిత అనంత శ్రీరామ్ పై బీజేపీ వాళ్లు ఫిర్యాదు చేశార‌ట‌.  ఈ పాట నాగ‌దేవ‌త‌ను, సుబ్ర‌మ‌ణ్య‌స్వామిని కించ‌ప‌రిచేలా ఉంద‌ని వారు ఆరోపించారు. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఇటీవ‌ల విడుద‌ల అయిన ఆ పాట లిరిక‌ల్ వీడియో యూట్యూబ్ లో బాగానే వీక్ష‌ణ‌లు పొందింది. ఇలాంటి నేప‌థ్యంలో ఫిర్యాదు దాఖ‌లు అయ్యింది.

అయితే ఈ సంద‌ర్భంగా ఇదే ట్యూన్ లో దాదాపు సేమ్ పంక్తుల‌తో ఉన్న కొన్ని పాట‌లు గుర్తుకురాక‌మాన‌వు. ముందుగా దిగు దిగు నాగా.. అనే పాట అనేక దేవాల‌యాల్లో ప్ర‌తినిత్యం వినిపించే పాటే. ద‌శాబ్దాలుగా గుళ్ల‌లో ప్లే చేసే ప్రైవేట్ డివోష‌న‌ల్ ఆల్బ‌మ్ లోది కాబోలు ఈ పాట‌. ఈ పాటకు ఆ త‌ర్వాత అనేక రీమిక్స్ లు వ‌చ్చాయి. నాగ దేవ‌త‌నే కాక ఇత‌ర దేవ‌త‌ల‌ను కీర్తిస్తూ కూడా అదే ట్యూన్ లో ప‌లు సాంగ్స్ వ‌చ్చాయి. ఏతావాతా ఇదో డివోష‌న‌ల్ ట్యూన్ గా సూప‌ర్ హిట్.

అయితే.. ఏదైనా క‌ల్ట్ హిట్ అయితే దాన్ని త‌మ సినిమాల్లోకి అన్వ‌యించ‌డం టాలీవుడ్ వాళ్ల‌కు కొత్త కాదు. దీంతో ద‌శాబ్దాల కింద‌టే ఈ ట్యూన్ సినిమాల్లోకి వ‌చ్చింది. స్వ‌యంగా చిరంజీవి సినిమాలోనే ఈ ట్యూన్ రావ‌డం రావ‌డం గ‌మ‌నార్హం. దిగు దిగు భామ‌.. ఈ ప్రేమ లోతెంతో చూద్దామ్మా.. అంటూ అత్త‌కుయముడు అమ్మాయికి మొగుడు సినిమాలో ఒక పాట ఉంటుంది. నాగ ప్లేస్ లో భామ పెట్టి.. ట్యూన్ క‌ట్టిన‌ట్టున్నారు. చ‌క్ర‌వ‌ర్తి సంగీత సార‌ధ్యంలో ఆ పాట వ‌చ్చింది. బాగా హిట్ట‌య్యింది కూడా.

ఆ త‌ర్వాత కూడా దిగు దిగు నాగ ట్యూన్ ను టాలీవుడ్ వ‌దల్లేదు. సురేష్ ప్రొడ‌క్ష‌న్ వాళ్లు తీసిన స‌ర్ప‌యాగం సినిమాలో.. దిగు దిగు నాగ అంటూ పంక్తుల‌ను కూడా వాడేశారు.  అది ప‌క్కా ఐట‌మ్ సాంగ్! ఎరోటిక్ సాంగ్ అన‌డం క‌రెక్టేమో. ఆ మ‌ధ్య ఏపీలో పొలిటీషియ‌న్ అవ‌తారం ఎత్తిన  వాణీ విశ్వ‌నాథ్ ఆ పాట‌లో న‌ర్తించింది. చిత్ర పాడిన ఆ పాట చాలా క‌వ్వింపుగా సాగుతుంది.

ఇక అల్ల‌రి న‌రేష్ సినిమాలో దిగు దిగు నాగ ట్యూన్ ను కామెడీగా వాడారు. బెండు అప్పారావు ఆర్ఎంపీ సినిమాలో కామెడీ టైమింగ్ కు అనుగుణంగా క‌మేడియ‌న్ల చేత దిగు దిగు నాగ‌.. అంటూ ఒక ట్యూన్ తో పాట‌ను ట్యూన్ క‌ట్టి చిత్రీక‌రించి విడుద‌ల చేశారు.

ఇలా గ‌తంలో దిగు దిగు నాగ ట్యూన్ ను టాలీవుడ్ జ‌నాలు డ్యూయెట్ గా, ఎరోటిక్ గా, కామెడీగా వాడారు. ఇప్పుడు అదే ట్యూన్ ను ప‌క్కా ఐట‌మ్ సాంగ్ గా వాడారు. ఈ సారి మాత్రం అభ్యంత‌రం వ్య‌క్తం అవుతోంది. ఫిర్యాదు కూడా న‌మోదైంది. మ‌రి ఈ వ్య‌వ‌హారం ఎంత వ‌ర‌కూ వెళ్తుందో!