'అందగాడు.. మహేశ్ బాబు..' ఈ ఒక్క మాటనే ఆయన సినిమాల్లోనే పరిపరి విధాలుగా చెబుతున్నారు. అది నిజమే, అయితే ప్రతి సినిమాలోనూ మహేశ్ గురించి హీరోయిన్ చేత ఈ తరహాలో డైలాగులు చెప్పిస్తూ, సినిమాల్లోని సైడ్ క్యారెక్టర్లైన అమ్మాయిలంతా ఏమున్నాడే.. అని లొట్టలు వేసే డైలాగులే రిపీట్ అవుతుంటాయి.
ఎర్రగా ఉన్నాడని పొగరు.. అతడు సినిమాలో త్రిష డైలాగ్, ఏమున్నాడే తినేయాలనిపిస్తోంది.. దూకుడు సినిమాలో సెకెండ్ హీరోయిన్, ఇక సరిలేరు నీకెవ్వరులో మహేశ్ అందం గురించి డైలాగులు మరీ ఎక్కువయిపోయాయి! హీరోయిన్ చేతే గాక.. హీరోయిన్ తల్లి పాత్ర చేత కూడా అదే తరహా డైలాగులు. ఇక క్లైమాక్స్ లో హీరోయిన్ మహేశ్ అందం గురించినే చెప్పి వాపోతుంది పాపం! ఇక మహేశ్ తాజా సినిమాకు సంబంధించి అదేదో వీడియో విడుదల చేశారు. అందులో దిష్టి తీయించమంటూ హీరోయినే చెప్పింది పాపం!
మొత్తానికి టాలీవుడ్ రైటర్లు.. మహేశ్ అందం గురించి ఒక్కో సినిమాలో ఒక్కో వెర్షన్ చెప్పిస్తున్నారు. హీరోయిన్ల చేతే ఈ డైలాగులు అనిపిస్తున్నారు. ఇక మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాన మీడియాలోనూ, సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పడంలోనూ అందం మాత్రమే హైలెట్ అవుతోంది! మొత్తానికి మహేశ్ ను అందగాడిగా మాత్రమే చూపించే ఉద్దేశమా లేక, ఎంత చెప్పినా తనివి తీరకపోవడమో!
గమనించాల్సిన అంశం ఏమిటంటే.. అంతకు ముందు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోనూ అందం గురించి ఇదే హైలెట్ పాయింట్. తెల్లగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు.. ఏమిట్రా ఇదంతా? అన్నట్టుగా ఒక డైలాగ్ చెబుతాడు మహేశ్. అది వెంకటేష్ ను ఉద్దేశించిన సీన్ లో! మహేశ్ గురించి కూడా ఈ అతిశయోక్తులు మరీ ఎక్కువయిపోవడంతో ఆ సీన్ గుర్తుకురావడం లో వింత ఏమీ లేదు.
అందానికి ప్రామాణికం, ప్రత్యేకించి హీరోల అందానికి ఒక నిర్వచనం అంటూ ఏమీ లేదు సుమా! డెబ్బై యేళ్ల వయసుకు దగ్గర పడిన హీరోలను కూడా భారతీయ సినిమాల్లో..అప్పుడే విరిసిన అందగాళ్లుగా, యువకులుగా, అప్పుడే ప్రేమలో పడే కుర్రాళ్లుగా చూపిస్తున్నారనే విషయాన్ని మరవొద్దు!
రాజుగారి చిన్న భార్య అందగత్తె అంటే, పెద్ద భార్య కాదనే కదా.. అనే సామెత మనదే. మరి మహేశ్ అంత వీరలెవల్ అందగాడు, వయసు మీద పడుతున్నా యువకుడిలా మారిపోతున్న వాడైతే, మరి టాలీవుడ్ లో అందగాడు కాని హీరో ఎవరు? వయసు మీద పడే కొద్దీ ముసలివాడవుతున్న హీరో పేరు ఒక్కటి చెప్పండి చూద్దాం! టాలీవుడ్ రైటర్లు, దర్శకులే ఈ మాట చెప్పాలి.