చూస్తుంటే.. సీనియర్ హీరోయిన్లకు ఛాన్సులిచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసినట్టున్నాడు నాగార్జున. మొన్నటికి మొన్న వైల్డ్ డాగ్ సినిమాలో దియా మీర్జాను తీసుకున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆమెను టాలీవుడ్ స్క్రీన్ పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ గుల్ పనాగ్ కు లైఫ్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాడు.
ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు నాగార్జున. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ నటి గుల్ పనాగ్ ను తీసుకున్నారు. ప్రస్తుతం నాగ్-గుల్ పనాగ్ పై హైదరాబాద్ లో షూటింగ్ నడుస్తోంది.
ఒకప్పుడు బికినీ షూట్స్ కు పెట్టింది పేరు గుల్ పనాగ్. అలా సినిమాల్లోకొచ్చిన ఈ ముద్దుగుమ్మ సరైన కథల ఎంచుకోలేక కెరీర్ ను పాడుచేసుకుంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్ ల పైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఫ్యామిలీ మేన్, పాతాల్ లోక్ లాంటి వెబ్ డ్రామాల్లో నటించింది. ఇలాంటి టైమ్ లో ఈమెకు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు నాగ్.
ఇక నాగ్ మూవీ షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి హైదరాబాద్ లో సెకెండ్ షెడ్యూల్ నడుస్తోంది. తొలి షెడ్యూల్ గోవాలో పూర్తయింది. గరుడవేగ టైపులో ఇది పూర్తి యాక్షన్ మూవీ. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.