ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, చిరంజీవి మరో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రభుదేవా డైరక్షన్ లో చిరంజీవి, ఓ రీమేక్ ప్రాజెక్టు చేసే అవకాశం ఉంది. అయితే ఆ రీమేక్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇప్పటికే చిరు చేతిలో 2 రీమేక్ సినిమాలున్నాయి. త్వరలోనే లూసిఫర్ రీమేక్ సెట్స్ పైకి రాబోతోంది. ఆ తర్వాత వేదాళం రీమేక్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా ప్రభుదేవా దర్శకత్వంలో రీమేక్ కు కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఈసారి హిందీ హిట్ మూవీని చిరంజీవి కోసం ప్రభుదేవా తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
ఇంతకుముందు చిరంజీవి-ప్రభుదేవా కాంబినేషన్ లో శంకర్ దాదా జిందాబాద్ సినిమా వచ్చింది. ఆ మూవీ తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఓ హిందీ సినిమా రీమేక్ తో చిరంజీవిని డైరక్ట్ చేయబోతున్నాడట ప్రభుదేవా.
ప్రభుదేవాకు రీమేక్ స్పెషలిస్ట్ అనే పేరు ఉంది. సౌత్ నుంచి నార్త్ కు, నార్త్ నుంచి సౌత్ కు చాలా సినిమాల్ని తీసుకెళ్లాడు. నిజానికి లూసిఫర్ రీమేక్ కోసం అప్పట్లో ప్రభుదేవా పేరు కూడా తెరపైకొచ్చింది. అయితే ఆ టైమ్ లో రాధే (సల్మాన్ ఖాన్ హీరో) సినిమాతో బిజీగా ఉండడం వల్ల ప్రభుదేవా అందుబాటులోకి రాలేదు. అలా ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రభుదేవా, ఈసారి మరో రీమేక్ తో చిరంజీవిని సంప్రదించినట్టు తెలుస్తోంది.