దాదాపు రెండు నెలల తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన చంద్రబాబు విశాఖ ముఖం చూడకుండానే తిరిగి హైదరాబాద్ కి ఎగిరివెళ్ళిపోయారు. నిజానికి చంద్రబాబు విశాఖకు వస్తాననే డీజీపీ నుంచి అనుమతి తీసుకున్నారు.
కానీ ఆయన విశాఖ రాకుండా పార్టీ కార్యక్రమం మహానాడుని జామ్ యాప్ ద్వారా నిర్వహించుకుని మరేమీ పనిలేనట్లుగా హైదరాబాద్ సొంతింటికి వెళ్ళిపోవడం పట్ల వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
బాబు సహా తమ్ముళ్ళు ఇంతన్నారు, అంతన్నారు విశాఖ వస్తాం, ఎల్జీ పాలిమర్స్ ని ఆదుకుంటాం, పార్టీ తరఫున కూడా భారీ ఎత్తున సాయం చేస్తామని కూడా ప్రకటించారు. కానీ జరిగిందేమీ లేదని వైసీపీ నేతలు అంటున్నారు.
బాబు విశాఖ వస్తామని చెప్పి ఈ వైపు ముఖం చూపించకుండానే తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవడం పట్ల వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ మండిపడ్డారు. బాధితుల పట్ల బాబు చిత్తశుధ్ధికి ఇది నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
నిజానికి ప్రమాదం జరిగిన వెంటనే ఎవరైనా పరామర్శకు వస్తారు. తాపీగా మూడు వారాల తరువాత ఆంధ్రాకు వచ్చిన బాబు విశాఖ వస్తానని చెప్పి మరీ మాట తప్పారని ఆయన ఫైర్ అయ్యారు. బాబు వచ్చినా రాకపోయినా ఏమీ జరగదని, బాధితులను తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుందని కూడా ఆయన అంటున్నారు.
కానీ బాబు తమ్ముళ్లు నానా యాగీ చేసి ఇపుడు ఇలా ముఖం చాటేయడాన్నే తాము ప్రశ్నిస్తున్నామని ఆయన అంటున్నారు. మొత్తానికి విశాఖ ఎందుకో బాబుకు అందక చెందక ఆయన రాజకీయంతో చెడుగుడు ఆడుతోందని అంటున్నారు.