ఇండియాలో ఏ రోజుకారోజు కొత్త కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఎప్పటికిప్పుడు సింగిల్ డే హయ్యెస్ట్ అనే నంబర్ పెరుగుతోంది. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత మొన్నటి వరకూ రోజుకు 6 వేలకు పైగా కేసులు పెరిగాయి. నిన్న 7 వేలకు పైగా కొత్త కేసులు రిజిస్టర్ అయినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలా పెరుగుదల రేటు పెరుగుతూ ఉంది!
అయితే గమనించాల్సిన అంశం ఏమిటంటే.. పెరుగుదల కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతూ ఉంది. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కూడా కొత్త కేసుల పెరుగుదల కొన్ని రాష్ట్రాల్లోనూ, కొన్ని జిల్లాల్లోనే సాగుతూ ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ ఈ నాలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 70 శాతం కేసులున్నాయి! ఒక్క మహారాష్ట్ర మాత్రమే సింగిల్ గా దాదాపు దేశంలోని 40 శాతం కేసులను కలిగి ఉంది! ఇలా కొన్ని రాష్ట్రాలే దేశం మొత్తం కరోనా కేసుల సంఖ్యను పెంచుతున్నాయి.
ఇలా రాష్ట్రాల యూనిట్ గా చూస్తే కొన్ని రాష్ట్రాలే ముందున్నాయి. అయితే జిల్లా యూనిట్ గా చూస్తే మరో రకమైన విషయం తెలుస్తోంది. ఇంత పెద్ద దేశంలో 13 జిల్లాల పరిధిలోనే ఏకంగా 70 శాతం కేసులున్నాయట!
ముంబై మున్సిపాలిటీ, ఢిల్లీ-న్యూఢిల్లీ మున్సిపాలిటీ,అహ్మదాబాద్, థానే, హైదరాబాద్, కోల్ కతా -హౌరా, ఇండోర్, జైపూర్, జోథ్ పూర్, చెంగల్పట్టు, తిరువల్లూర్ ఈ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోనే దేశం మొత్తం కరోనా నంబర్ లోని 70 శాతం కేసులున్నాయట!
ఇలా కరోనా వ్యాప్తి కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతం అవుతోందని స్పష్టం అవుతోంది. ఈ విషయాన్ని గ్రహించి కరోనాను ఎదుర్కొనడంలో దేశం వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు తప్పనిసరిగా టెస్టులు చేయడం, ఆ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు పరచడం, ఆ ప్రాంతాల నుంచి ప్రజలు ఇతర ప్రాంతాలకు ట్రావెల్ చేయకుండా చూడటం.. వంటి కఠిన నిబంధనలనే ప్రభుత్వాలు అమలు చేయాల్సి ఉంది. అలా కాకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తే మాత్రం.. వ్యాప్తి ఎక్కువగా ఉన్న చోట్ల నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశాలు చాలా పెరుగుతాయి.
మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, బెంగాల్ తో పాటు పైన పేర్కొన్న ప్రాంతాలన్నింటి నుంచి వచ్చే ప్రజలపై మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు డేగ కన్ను వేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది.