లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇక తను చెప్పేదేం లేదన్నట్టుగా వ్యవహరించనుందనే మాట వినిపిస్తోంది. మే 31తో కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ ముగియనుంది. జూన్ ఒకటి నుంచి కొత్త విధానం ఏమిటో ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ మాట్లాడారని తెలుస్తోంది. కరోనా కేసుల ప్రస్తుత స్థితిగతులు తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి వారితో అమిత్ షా మాట్లాడారట.
లాక్ డౌన్ నుంచి ప్రధానమంత్రి మోడీ మాట్లాడటం మానేసి అప్పుడే నెల గడుస్తోంది. ఇప్పుడంతా షా నే మాట్లాడుతున్నారు, అది కూడా ముఖ్యమంత్రులతో మాత్రమే. ప్రజలతో డైరెక్టు సంభాషణలు లేవిప్పుడు. ఈ క్రమంలో లాక్ డౌన్ బాధ్యతల నుంచి ఇక కేంద్రం పూర్తిగా తప్పుకోనుందని తెలుస్తోంది. జూన్ ఒకటి నుంచి ఎలా లాక్ డౌన్ ను అమలు చేయాలి, ఏవి తెరవాలి, వేటిని మూసేయించాలనేది పూర్తిగా రాష్ట్రాల ఇష్టంగా వదిలిపెట్టనుందట కేంద్రం.
ఒకవైపు దేశంలో కేసుల సంఖ్య రోజుకో కొత్త పెద్ద నంబర్ ను డిస్ ప్లే చేయిస్తోంది. అయితే పెరుగుతున్న కేసులు చాలా వరకూ కొన్ని రాష్ట్రాల్లోనే. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులు మెజారిటీ కేసులను పెంచుతున్నాయి. మరి కొన్ని రాష్ట్రాల్లో గ్రోత్ రేటు తక్కువ, రికవరీ రేటు మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి లాక్ డౌన్ ను పాటించాలనే అంశం గురించి కేంద్రం రాష్ట్రాలకే నిర్ణయాధికారాన్ని ఇవ్వనుందని స్పష్టం అవుతోంది. అయితే పక్షం రోజులకు ఒకసారి కేంద్రం లాక్ డౌన్ గురించి రాష్ట్రాలతో సమీక్ష నిర్వహిస్తుందట.