సహజంగా ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటాయి. వారి ఓటు బ్యాంకుని దృష్టిలో ఉంచుకుని ఆయా వర్గాలను ఉచిత పథకాలతో ఆకర్షిస్తుంటాయి. ఈ క్రమంలో ఉద్యోగ వర్గాలు నిరాశ చెందే అవకాశం ఎక్కువ. అయితే వారికి కూడా ఊరటనిచ్చేలా ప్రభుత్వాలు కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఇచ్చే జీతాన్ని తమ జేబులో నుంచే ఇస్తున్నట్టు ఫీలయ్యే నాయకులు కొంతమంది ఆ పని చేయలేరు, ఫలితం వారి ఆగ్రహానికి గురై అధికారానికి దూరం కావాల్సి వస్తుంది.
ఇప్పటికే చంద్రబాబుకి ఈ తరహా అనుభవాలు రెండు ఉన్నాయి. గతంలో చంద్రబాబుకి పని రాక్షసుడనే పేరుంది. అప్పట్లో ఆయన ఉపాధ్యాయుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని పని పేరుతో తీవ్రంగా వేధించారు. పనివేళల తర్వాత కూడా ఏదో ఒక సాకుతో కొత్త పనులు అప్పగించేవారు. దాంతో అప్పట్లో బాబుని దింపేసి ఉద్యోగులంతా వైఎస్ఆర్ కి మద్దతిచ్చారు. వైఎస్ పాలనలో ఏనాడూ ఉద్యోగులు ఇబ్బంది పడలేదు. ఆయనే బతికుంటే.. కచ్చితంగా ఆయనకే ఉద్యోగులు మూడోసారి మద్దతిచ్చేవారు.
కాలం కలిసొచ్చి చంద్రబాబు, అనుభవం అనే సాకుతో అందలమెక్కారు. అయితే అప్పుడు కూడా తన బుద్ధి చూపించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ పేరుతో ఉద్యోగుల్ని వేధించారు. అసలు పక్కనపెట్టి, నివేదికలు తయారు చేయాలని చెప్పి వారిని ఇబ్బంది పెట్టారు. ఫలితం, మరోసారి అధికారం కోల్పోయారు. సీపీఎస్ రద్దు హామీ సహా.. ఇతర హామీలతో ఉద్యోగులంతా జగన్ కి మద్దతిచ్చారు.
జగన్ ఏం చేస్తున్నారు..?
చెప్పినట్టుగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు కానీ, దానివల్ల ఆర్టీసీ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని పట్టించుకోలేదు. విలీనం తర్వాతే తమకు బెనిఫిట్స్ తగ్గాయని వాదించే వర్గం కూడా ఉంది. వారితో చర్చించి సమస్య పరిష్కారం చేస్తేనే జగన్ కి మైలేజీ. ఇక నిరుద్యోగులతో పాటు, ఉపాధ్యాయులు కూడా డీఎస్సీ కోసం ఎదురు చూస్తుంటారు. కొత్త బ్యాచ్ వస్తే, తమపై కాస్తో కూస్తో పనిభారం తగ్గుతుందనేది వారి ఆలోచన. ప్రమోషన్లకి కూడా అవకాశం ఉంటుంది.
కానీ ఆ పని కూడా ఇంకా జరగలేదు. దీనికితోడు తాజా పథకాలతో జగన్, తమని రేషన్ డీలర్లుగా మార్చేశారని వాపోతున్నారు ఉపాధ్యాయులు. పైగా రెండేళ్లుగా ఒకే జీతంతో పనిచేస్తున్నామని, ఖర్చులు మాత్రం పెరిగిపోయాయని అంటున్నారు. ఒక డీఏ ప్రకటించినా మిగతా డీఏల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.
ఇక రెవెన్యూ ఉద్యోగుల్లో అభద్రతాభావం నెలకొంది. సచివాలయం పోస్ట్ లతో ఒకరకంగా వారికి పని ఒత్తిడి తగ్గినా కొత్త బ్యాచ్ తో వారి అధికారాల్లో కోతపడింది. డీఏ ఊసు లేదు, సీపీఎస్ రద్దుపై ప్రకటనలు తప్ప పని జరగలేదు. జీతాలు, పింఛన్లకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఉద్యోగులు అనుకోలేదు. కానీ కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒకటో తేదీ జీతం పడుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు.
ఏపీలో అన్ని వర్గాలకు ఆర్థిక సాయం చేస్తూ ఎడా పెడా నిధులు విడుదల చేస్తున్న జగన్, తమని ఎందుకు పట్టించుకోవడంలేదనే ఆవేదన ఉద్యోగ వర్గాల్లో ఉంది. మరి వారి ఆవేదన పట్టించుకునేదెవరు? ఎప్పుడు..?
సంక్షేమం అంటే రాష్ట్రంలో ఉండే ప్రజలంతా సంక్షేమంగా ఉండాలి. కేవలం బీదా బిక్కీ సంతోషంగా ఉండి, ఉద్యోగ వర్గాలు భయాందోళనల్లో ఉండటం సరికాదు. మరి జగన్ ఆ దిశగా ఎప్పుడు ఆలోచిస్తారనేది వేచి చూడాలి. అన్ని వర్గాలతో పాటు, ఉద్యోగస్తులను కూడా సంతోష పెట్టగలిగితేనే జగన్ కి మరోసారి వారు మద్దతిస్తారు. లేకపోతే గతంలో చంద్రబాబుకి ఎలాంటి షాకిచ్చారు, రేపు జగన్ కి కూడా అలాంటి షాకిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.