జనసేనలో మెగా బ్రదర్ నాగబాబు ఇమడ లేకున్నారా? పార్టీ నుంచి బయటికి రాలేక సతమతమవుతున్నారా? రాజీనామా చేస్తే రాజకీయంగా తమ్ముడిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని భావిస్తున్నారా? మనసు చంపుకుని పార్టీలో ఉండలేక, అలాగని ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టి కొనసాగలేకున్నారా….అనే ప్రశ్నలన్నింటికి ఆ పార్టీ శ్రేణుల నుంచి “అవుననే” సమాధానం వస్తోంది. దీనికి ఇటీవలి పరిణామాలే నిదర్శనమని జనసేన శ్రేణులు అంటున్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం పాలైంది. చివరికి రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన జనసేనాని పవన్‌కల్యాణ్ కూడా ఓటమిపాలయ్యారు. పార్టీ తరపున రాపాక వరప్రసాద్ మాత్రమే గెలుపొందారు. దీంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ, నిస్తేజం అలుముకున్నాయి. దీంతో పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటికి వెళ్లారు.
ప్రధానంగా జనసేనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజీనామా చేయడం పెద్ద షాక్‌గా చెప్పొచ్చు. ఈ సందర్భంగా పవన్ ముందు చెప్పినట్టు పూర్తిస్థాయిలో రాజకీయాలకు సమయం కేటాయించడం లేదని, సినిమాల్లోకి మళ్లీ వెళ్లడం తనకు నచ్చలేదని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జనసేనలో స్వయంగా పవన్ సోదరుడు నాగబాబు ఇమడలేక పోతున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది..
నిజానికి చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు పార్టీకి నాగబాబు వెన్నుదన్నుగా నిలిచాడు. పార్టీ ఆవిర్భావ సభ మొదలుకుని ఎన్నికల వరకు నాగబాబు కీలకపాత్ర పోషించారు. ప్రజారాజ్యం తర్వాత జనసేనను పవన్‌కల్యాణ్ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేయడంతో తమ్మునికి సాయం చేసేందుకు నాగబాబు ఆ పార్టీలో చేరారు.
అంత వరకూ నాగబాబు తన సొంత యూట్యూబ్ చానల్లో రాజకీయ, సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉన్నారు. నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా నాగబాబు పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు చేతిలో ఓడిపోయారు. అనంతరం తన పనేదో తాను చేసుకుంటూ వెళుతున్నారు. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
ఈ నేపథ్యంలో గాడ్సే, గాంధీజీలపై ట్విటర్ వేదికగా వివాదాస్పద ట్వీట్స్ చేశారు. దీనిపై రాజకీయంగా దుమారం చెలరేగింది. భారత జాతిపితను చంపిన గాడ్సేను జనసేన వెనుకేసుకొస్తోందనే విమర్శలు చెలరేగాయి. దీంతో జనసేనాని పవన్‌కల్యాణ్ స్పందించాల్సి వచ్చింది. ఈ నెల 23న ట్విటర్లో ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన శీర్షికే నాగబాబును హర్ట్ చేసిందంటున్నారు. “వ్యక్తిగత అభిప్రాయాలతో జనసేనకు సంబంధం లేదు” అనేది ఆ ప్రకటన శీర్షిక. ఇక ప్రకటనలోకి వెళితే…
“జనసేన పార్టీలో లక్షలాదిగా ఉన్న నాయకులు, జన సైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసే అభిప్రా యాలు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలే గానీ, పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ నాగబాబు గారు సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవి. పార్టీకి ఎలాంటి సంబంధం లేదు” అని పేర్కొన్నారు. పవన్ నుంచి వెలువడిన ఈ అభిప్రాయాలు నాగబాబు మనసును గాయపరిచాయంటున్నారు.
అంటే లక్షలాదిగా ఉన్న నాయకులు, జన సైనికులు, అభిమానుల్లో తనను కేవలం ఒకడిగా పవన్ పరిగణించారనే అభిప్రాయం నాగబాబును ముళ్లలా గుచ్చుకుంటోందని ఆయన అభిమానులు అంటున్నారు. అందుకే మౌనంగా తన నిరసన వ్యక్తం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రహీరో బాలకృష్ణ చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై నాగబాబు తన యూట్యూబ్ చానల్లో స్పందిస్తూ…తగిన జాగ్రత్తలు తీసుకున్నాడని నాగబాబు అభిమానులు గుర్తు చేస్తున్నారు. “ఈ వీడియో కేవలం నా సొంత బాధ్యతపై చేస్తున్నాను” అని చెప్పడం ద్వారా తనకు జనసేనతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడని నాగబాబు అభిమానులు, జనసైనికులు ప్రస్తావిస్తున్నారు.
తద్వారా పవన్‌కల్యాణ్‌కు తగిన రీతిలో సమాధానం ఇచ్చినట్టైందని పలువురు అంటున్నారు. జనసేనలో నాగబాబు పాత్ర కేవలం నామమాత్రమేనని, ఆయన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనక పోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా రాజీనామా చేస్తే తమ్మునికి రాజకీయంగా నష్టం వస్తుందనే ఉద్దేశంతోనే నాగబాబు పార్టీలోనే మౌనంగా, అయిష్టంగా ఉంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
-సొదుం