అంత్యక్రియల్లో నిర్లక్ష్యం.. 18 మందికి కరోనా

అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా, కరోనా విషయంలో కొంతమంది వ్యవహారశైలి మారడం లేదు. నిర్లక్ష్యం వీడడం లేదు. అలాంటి ఓ నిర్లక్ష్యమే ఇప్పుడు ఏకంగా 18 మందికి కరోనా సోకేలా చేసింది. కరోనా ప్రభావం…

అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా, కరోనా విషయంలో కొంతమంది వ్యవహారశైలి మారడం లేదు. నిర్లక్ష్యం వీడడం లేదు. అలాంటి ఓ నిర్లక్ష్యమే ఇప్పుడు ఏకంగా 18 మందికి కరోనా సోకేలా చేసింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోని థానెలో ఈ ఘటన జరిగింది.

థానె జిల్లాలోని ఉల్లాస్ నగర్ లో 40 ఏళ్ల మహిళ కరోనాతో మృతిచెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని అత్యంత జాగ్రత్తగా, పకడ్బందీగా ప్యాక్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎట్టిపరిస్థితుల్లో మృతదేహానికి కప్పిఉంచిన సీల్ తీయొద్దని హెచ్చరించారు. కానీ మూర్ఖపు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు.

చివరి చూపు చూడడం కోసం కవర్ ఓపెన్ చేశారు. అంత్యక్రియలకు సంబంధించి కొన్ని లాంఛనాలు కూడా చేశారు. తెలిసి మరీ చేసిన ఈ తప్పుకు వాళ్లు శిక్ష అనుభవించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న 18 మందికి ఇప్పుడు కరోనా సోకింది. ఈ 18 మందితో పాటు, అంత్యక్రియల్లో పాల్గొన్న మరో 50 మందిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

ఎన్ని జాగ్రత్తలు చెప్పినా మృతదేహం కవర్ తీసినందుకు సదరు కుటుంబ సభ్యులపై అధికారులు పోలీస్ కేసు పెట్టారు. అంతేకాదు.. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మందితో అంత్యక్రియలు చేసినందుకు కూడా మరో కేసు పెట్టారు. కుటుంబ సభ్యులు కరోనా నుంచి కోలుకున్న వెంటనే వాళ్లను విచారిస్తామని, కోర్టులో హాజరుపరుస్తామంటున్నారు థానే పోలీసులు.

లంచాల మాట లేని ప్రభుత్వ పాలన: సీఎం జగన్‌