రాష్ట్రంలో బీజేపీ స్వరం పెంచుతోంది. అధికారపక్షంపై విమర్శలు చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు, వెనకాడ్డంలేదు. సభ్యత్వాలంటూ హడావిడి చేస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా, పురందీశ్వరి వంటి నేతలు సైతం జగన్ పై అభాండాలు మోపడంలో ముందుంటున్నారు. ఇటీవల కాలంలో బీజేపీ విమర్శల దూకుడు మరీ ఎక్కువైనట్టు కనిపిస్తోంది. అయితే ఇదంతా కేవలం సెల్ఫ్ ప్రమోషన్ కోసం చేస్తున్న ప్రయత్నంలానే కనిపిస్తోంది తప్ప నిర్మాణాత్మక విమర్శ అనిపించడం లేదు.
రాష్ట్రంలో వైసీపీని విమర్శిస్తేనే మీడియాలో ప్రముఖంగా వస్తుంది, అందులోనూ జగన్ పాలసీలపై పడి ఏడిస్తే కాస్తో కూస్తో ప్రముఖంగా ఆ వార్తలు హైలెట్ అవుతాయి. అందుకే కన్నా లక్ష్మీనారాయణ సహా చాలామంది ఇదే ఎత్తుగడ అనుసరిస్తున్నారు. బీజేపీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాల్లో కూడా తమ పార్టీ గురించి చెప్పుకోకుండా వైసీపీని విమర్శించడంతోనే సరిపెడుతున్నారంటే విషయం ఈజీగానే అర్థమౌతోంది. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే, ఆటోమేటిగ్గా బాబు అను”కుల” మీడియా దానికే ప్రాధాన్యం ఇస్తుందనే విషయం బీజేపీకి కూడా తెలుసుకదా.
ఓవైపు కేంద్రం సూచన మేరకే వరల్డ్ బ్యాంక్ రుణం ఇవ్వడానికి ఇష్టపడక వెనక్కు వెళ్లిపోయిందనే వార్తలు వస్తున్నా కన్నా మాత్రం ఆ నిందను రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టేశారు. జగన్ సర్కారు సరిగా స్పందించక పోవడంతోనే ప్రపంచ బ్యాంక్ వెనక్కు వెళ్లిపోయిందట. రెండు నెలల్లోనే జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా విమర్శించారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డిని పొగుడుతూ, ఆయన కొడుకు జగన్ ని మాత్రం విమర్శిస్తున్నారు కన్నా. కనీసం ఒక్క అసెంబ్లీ సీటు గెలిచే సత్తాలేకపోయినా, రాష్ట్ర అసెంబ్లీ జరుగుతున్న తీరుని విమర్శిస్తున్నారాయన.
అయితే అసలు విషయాన్ని మాత్రం బీజేపీ నేతలు పక్కనపెట్టేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం అని చెబుతూ తమ చేతగానితనాన్ని బహిరంగంగా సమర్థించుకుంటున్నారు కమలనాథులు. కనీసం రాష్ట్రానికి జీఎస్టీ మినహాయింపులు కూడా సాధించుకోలేని వాళ్లు వైసీపీని విమర్శించడం నిజంగా సిగ్గుచేటు. ఏపీలో మూలనపడిపోయిన పాత సరుకునంతా పార్టీలో చేర్చుకుంటూ వాపు, బలుపు అంటూ లెక్కలేసుకుంటున్న బీజేపీ.. వైసీపీని విమర్శిస్తే మాత్రం నవ్వులపాలు కావడం ఖాయం.
హోదా ఇవ్వకుండా కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్న బీజేపీ… అసలు సీఎం జగన్ ను విమర్శించే హక్కు తమకు ఉందో లేదో ఓసారి చెక్ చేసుకుంటే బెటర్.