తను ఈ రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా ప్రకటించుకున్నారు బీజేపీ శాసనసభా పక్షనేత యడ్యూరప్ప. ఢిల్లీ వెళ్లి వచ్చిన యడ్యూరప్ప గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తను రెడీ అని చెప్పారట. అల్రెడీ యడ్యూరప్ప బీజేఎల్పీ లీడర్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా తీర్మానాలు ఏమీ అసవరం లేకుండా ఆయనే వెళ్లి గవర్నర్ ను కలిసేందుకు మార్గం సుగమం అయ్యింది.
పద్నాలుగు నెలల తర్వాత మరోసారి యడ్యూరప్ప ఇలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గవర్నర్ కూడా బీజేపీ సంబంధీకుడే కాబట్టి యడ్యూరప్పకు ఎదురులేనట్టే. పద్నాలుగు నెలల కిందట కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాకా యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తి మెజారిటీ లేకపోయినా అప్పుడు యడ్యూరప్పకు ఛాన్స్ ఇచ్చారు.
అయితే ఆ ముచ్చట రెండు రోజులకే పరిమితం అయ్యింది. బలనిరూపణలో ఓడి యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయారు. ఆ తర్వాత కుమారస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ ల ప్రభుత్వం ఏర్పడింది.
అది పడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ యడ్యూరప్పకు అవకాశం వచ్చినట్టే. బీజేపీ వాళ్లేమో డెబ్బై ఐదేళ్ల వయసు మీద పడిన వాళ్లకు కీలక పదవులు ఇచ్చేదిలేదని అంటూ ఉంటారు. అయితే కర్ణాటకలో ఇప్పుడు యడ్యూరప్ప మించి వారికి వేరే ఛాయిస్ లేదు. దీంతో తమ నియమాన్ని పక్కనపెట్టి డెబ్బై ఆరేళ్ల యడ్యూరప్పనే సీఎంగా చేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం ముచ్చట ఎన్నాళ్లో అనే సణుగుడు వినిపిస్తోంది.