మూడు రోజులుగా ప్రతిపక్షం లేని అసెంబ్లీని చూస్తున్నాం. సస్పెన్షన్లు, వాకౌట్ల నేపథ్యంలో అధికార పక్షానికి ఫుల్ లెంగ్త్ మాట్లాడే అవకాశం వచ్చింది. అయితే దీన్ని వైసీపీ శాసన సభ్యులు ఎలా ఉపయోగించుకుంటున్నారనేదే అసలు విషయం. ప్రతిపక్షం లేదు కాబట్టి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. రన్నింగ్ కామెంట్రీ కొట్టాల్సిన అగత్యంలేదు. మరి అదే సమయంలో ప్రజలకు జవాబుదారీగా ఉండే నాలుగు ముక్కలు నింపాదిగా మాట్లాడే అవకాశం కూడా ఇప్పుడే వచ్చినట్టు.
అలాంటి అవకాశాన్ని వైసీపీ శాసనసభ్యులు చాలామంది స్త్రోత్రాలు, అష్టోత్తరాలకు పరిమితం చేయడం విచిత్రం. ఒకర్ని మించి ఒకరు, ఒకరికి పోటీగా ఇంకొకరు.. జగన్ భజనలో మునిగి తేలుతున్నారు. ఎంతలా అంటే, జగనే వద్దూ వద్దూ అంటూ దణ్ణంపెట్టేలా. అధినేతను పొగడొద్దని ఎవరూ అనరు, అయితే దానికీ ఓ లిమిట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆకాశమే హద్దు అన్నట్టుగా చెలరేగిపోతున్నారు. ఇంకెప్పుడూ అవకాశం రాదన్నట్టుగా, పక్క సభ్యుడు ముందే పొగిడేస్తారేమోనన్న ఆదుర్దాలో జగన్ భజనలో తరిస్తున్నారు కొంతమంది.
జగన్ ని దేవుడంటూ ఆకాశానికెత్తేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఈ పొగడ్తల ముందు చిన్నబోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. క్రీస్తు, అల్లా, సాయిబాబా, అంబేద్కర్.. ఇలా పోలికల్లో కూడా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇవన్నీ సీఎం జగన్ కి కూడా కాస్త ఇబ్బందిగానే ఉన్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో నవ్వి ఊరుకుంటున్నారు. అదే సమయంలో వారికి కర్తవ్య బోధన చేస్తున్నారు కూడా. సభ అయిపోయిన తర్వాత ఇలా పొగడ్తల వర్షం కురిపించిన వారందర్నీ పిలిపించి కాస్త సున్నితంగానే హెచ్చరించారట ముఖ్యమంత్రి.
అయితే ఈ విషయంలో మాత్రం జగన్ హెచ్చరికల్ని, అభ్యర్థనల్ని ఎమ్మెల్యేలు ఖాతరు చేయడంలేదు. సభ ఎప్పుడు మొదలవుతుందా, అష్టోత్తకం ప్రారంభిద్దాం అన్నట్టుంది వ్యవహారం. మూడు రోజులుగా ఈ తంతు జరుగుతున్నా ఎవరూ వెనక్కి తగ్గడంలేదు. మరికొన్ని రోజుల్లో సభ ముగుస్తున్న వేళ, ఇంకెన్ని కొత్త కొత్త స్తోత్రాలు, భజనలు వినాల్సి వస్తుందో అని వైసీపీ సీనియర్లే గుసగుసలాడుకోవడం విశేషం.