రాజకీయాలు, సినిమాలు వేర్వేరని మంత్రి ఆర్కే రోజా తన చర్యలతో చెబుతున్నారు. ఇండస్ట్రీ పరంగా బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తదితరులపై రోజా అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. కానీ రాజకీయాలకు వచ్చే సరికి వైఎస్ జగన్ తర్వాతే ఎవరైనా అని ఆమె తేల్చి చెబుతారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలపై నందమూరి బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బాలయ్యకు మంత్రి రోజా తన మార్క్ వార్నింగ్ ఇవ్వడం చర్చకు దారి తీసింది. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న రోజా మీడియాతో మాట్లాడుతూ బాలయ్యపై మండిపడ్డారు. అలాగే ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందుగా ఆమె ట్వీట్ గురించి తెలుసుకుందాం.
“బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు… జగన్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ”గన్” అనే రియల్ సింహం. తేడా వస్తే దబిడి దిబిడే..!!” అంటూ తనదైన స్టైల్‌లో బాలయ్యకు దీటైన సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా బాలయ్య సినిమా డైలాగ్‌నే తీసుకుని, ఆయనకు కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా వుండగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆనాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి…పార్టీని హస్తగతం చేసుకున్న ఘనత చంద్రబాబు నాయుడిది కాదా? అని రోజా ప్రశ్నించారు. మీ తండ్రి మరణానికి కారణమైన చంద్రబాబుపై పగ తీర్చుకోవాలని రోజా హితవు పలికారు. బాలయ్యపై వైసీపీ మంత్రులు వరుస దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి.