స్త్రీ, శిశుసంక్షేమశాఖలో గ్రేడ్-2 ఉద్యోగాలను బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారు. ఒక్కో పోస్టును అక్షరాలా రూ.6 లక్షలకు అమ్ముకున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిదీ పారదర్శకంగా ఉండాలని చెబుతుంటారు. అయితే ఆయన ఎంతో నమ్మకంగా స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ బాధ్యతల్ని అప్పగించిన ఉషశ్రీ చరణ్ నేతృత్వంలోని విభాగంలో పోస్టుల భర్తీలో పారదర్శకతకు తిలోదకాలు ఇచ్చారు.
ఒకట్రెండు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 560 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-2) పోస్టులను నిస్సిగ్గుగా పోస్టు రూ.6 లక్షలతో అమ్ము కున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం డబ్బే ప్రాతిపదికగా పోస్టుల భర్తీని చేపట్టినట్టు సమాచారం. ఈ భారీ స్కామ్ వెనుక మంత్రి కార్యాలయ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కేవలం ఉన్నత ఉద్యోగులు మాత్రమే ఈ అవినీతికి పాల్పడే అవకాశం లేదని అంటున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ పరిధిలోని 560 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేసే కాంట్రాక్టు వర్కర్లు, సూపర్‌వైజర్లతో పోస్టుల భర్తీకి నిర్ణయించారు. ఈ నెల 12వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకూ హాల్‌టికెట్లు జారీ చేశారు. ఈ నెల 18న రాష్ట్రంలోని నాలుగు జోన్ల పరిధిలో విశాఖ, ఏలూరు, ఒంగోలు, కర్నూలులో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 45 మార్కులకు రాత పరీక్ష, ఐదు మార్కులకు ఇంగ్లీష్ మాట్లాడే పరిజ్ఞానంపై ఇంటర్వ్యూ వుంటుందని పేర్కొన్నారు.
ఇవాళ అంటే ఆదివారం ముందే మాట్లాడుకున్న వారితో ఇంటర్వ్యూల నిర్వహణకు సంబంధిత శాఖ అధికారులు గోప్యంగా ఏర్పాట్లు చేసుకున్నారు. రాత పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయనే సంగతిని బయట పెట్టలేదు. అంతా గోప్యమే. పరీక్ష రాసిన అభ్యర్థులతో దళారులను పెట్టుకుని బేరాలు సాగించారు. ఒక్కో పోస్టు రూ.6 లక్షలకు తక్కువ కాకుండా తెగనమ్ముకున్నారని అభ్యర్థులు బహిరంగంగానే చెబుతున్నారు. అంత సొమ్ము చెల్లించలేని వారిని అనర్హులుగా తేల్చేశారు.
రెగ్యులర్ ఉద్యోగం కావడంతో డిమాండ్‌ను సంబంధిత శాఖ పాలకులు, ఉన్నతాధికారులు సొమ్ము చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పేద అభ్యర్థులు బలి పశువులు అయ్యారని చెప్పొచ్చు. స్త్రీ, శిశుసంక్షేమ శాఖలో చోటు చేసుకున్న భారీ అవినీతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తక్షణం చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పాలనలో పారదర్శకత కేవలం మాటలకే పరిమితమా? లేక ఆచరణలో చూపుతారా? అనేది తెలియడానికి జగన్‌కు ఇది పరీక్ష. జగన్ ఎటు వైపు ఉంటారో చూద్దాం.