ఒకటి కాదు, రెండు కాదు లక్షా ముఫై వేల కోట్ల నగదు బదిలీ జరిగింది ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు గత రెండేళ్లలో. ఎన్ని వేల మంది లేదా ఎన్ని లక్షల మంది లబ్ది పొంది వుంటారు. లబ్దిపొందిన కుటుంబాలే లబ్ది పొంది వుండొచ్చు. మొత్తం మీద ఆంధ్రలో ఓటర్లే, ఆంధ్రలో జనాలే లబ్ది పొందింది.
ఇలా జగన్ ను వదిలేస్తే మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి ఏమిటి పరిస్థితి? ఎన్నికల ముందుకు మేనిఫెస్టోతో వెళ్లే ఏ పార్టీ అయినా ఈ పథకాల మీద తమ అభిప్రాయం చెప్పాల్సిందే. హామీ ఇవ్వాల్సిందే. ఆల్రెడీ ఇస్తున్న జగన్ ను మించి ఏం హామీ ఇవ్వగలరు? ఇచ్చినా జనం ఎవర్ని నమ్ముతారు? అందుకే ఈ సమస్య ఏదీ లేకుండా, రాకుండా, జగన్ స్కీముల విషయీంలో ఫెయిల్ అయ్యాడు. స్కీముల వల్ల రాష్ట్రం పాడయింది? అని అనిపించేస్తే…
అదే ఇప్పుడు స్ట్రాటజీ. ఎలాగైనా జగన్ ను ఆర్ధిక దిగ్బంధనం చేసి ఓ మూడు నెలలు స్కీములు ఆపించగలిగితే..? అన్ని విధాల ప్రయోజనకారిగా వుంటుంది. అయితే స్కీములు ఆపించారు అన్న అపప్రధ ప్రతిపక్షాల మీదకు రాకుండా మీడియా చూసుకుంటుంది.
నిత్యం కేవలం ఆర్థిక వ్యవహారాల మీదే వార్తలు వండి వారుస్తూ,. పరిస్థితిని బూతద్దంలో చూపిస్తూ జనాల్లో రాష్ట్రం పరిస్థితి పట్ల ఓ భయాన్ని రేకెత్తిస్తే..మోడీ సర్కారులో తాము మూలన వుండిపోవాల్సి వచ్చినా, కాస్త ఇంకా మిగిలిన పలుకుబడి, తమకు అనుకూలమైన నాయకులు, అధికారుల ద్వారా తాము అనుకున్న దిశగా ఆంధ్రను ఆర్ధిక దిగ్బంధనం చేసే ప్రయత్నం స్టార్ట్ చేసారు.
దీని లక్ష్యం అంతా ఒక్కటే మూడు నెలల పాటు స్కీములను ఆపించగలగాలి. ఆ విధంగా స్కీముల పాలన సరైనది కాదు అని మిడిల్ క్లాస్ వర్గానికి చాటి చెప్పాలి. స్కీములు ఇవ్వలేడు జగన్ ఎన్నాళ్లో అని వాటిని అందుకున్న వర్గానికి చెప్పాలి. ఆ విధంగా జగన్ ను అన్ని విధాల దెబ్బ తీయవచ్చు.
అప్పుడు కానీ మళ్లీ అధికారం అందుకోవడం సాధ్యం కాదు. ఇలా జగన్ ను వదిలేస్తే అందినకాడికి అప్పులు చేసి మరీ జనాలకు డబ్బులు పంచుకుంటూ వెళ్లిపోతాడు. అయిదేళ్ల తరువాత ఆ జనం అతగాడినే గెలిపిస్తే రాష్ట్రం సంగతి దేవుడెరుగు ముందు తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధంతో మనుగడ సాగిస్తున్న సామాజిక వర్గం పూర్తిగా కుదేలైపోయే పరిస్థితి వుంది. అందుకే ఇప్పుడు స్కీములు ఆపించడానికి అతి పెద్ద కుట్రకు తెరలేచింది అన్నది రాజకీయ వర్గాల బోగట్టా.