సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యవహారం చివరికి సొంత పార్టీ నేతలకు కూడా కోపం తెప్పించింది. దీంతో విజయవాడలో సీపీఐ కార్యవర్గ సమావేశంలో రామకృష్ణను పార్టీ నేతలు కడిగిపారేశారు. చంద్రబాబు అనుకూల వైఖరిపై చీవాట్లు పెట్టారు. సీపీఐని చంద్రబాబు అనుబంధ పార్టీ అనే భావన ప్రజల్లో కలిగించేలా వ్యవహరించడం ఏంటని రామకృష్ణను నిలదీశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ టీడీపీ అనధికార ప్రతినిధి అనే రీతిలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
చాలా కాలంగా రామకృష్ణ వ్యవహార తీరుపై జనంలో అసహనం ఉంది. ఉదాహరణకు అమరావతి రాజధాని విషయంలో సీపీఎంతో పోల్చి సీపీఐని ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయవాదులు తిట్టిపోస్తున్నారు. ఈ రామకృష్ణ సీపీఐకున్న కాసింత విశ్వసనీయతను నాశనం చేసే వరకూ నిద్రపోయేలా లేరే అనే ఆవేదన వామపక్ష వాదుల నుంచి బలమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇలాంటి అభిప్రాయాలు చివరికి సీపీఐ నాయకుల్లో ఆగ్రహం తెప్పించాయి. రామకృష్ణను ప్రశ్నించేలా, పద్ధతి మార్చుకోవాలని హితవు చెప్పే వరకూ దారి తీశాయి. సీపీఐ రాజకీయ పంథా ఏంటో నిన్నటి సమావేశంలో రామకృష్ణకు అర్థమయ్యేలా మొట్టికాయలు వేసి మరీ చెప్పాల్సి వచ్చింది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సమక్షంలో జరిగిన ఈ సమావేశ వివరాలను తెలుసుకుందాం.
‘సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని.. ఆయన ప్రభుత్వాన్ని మనం చీటికిమాటికి ఎందుకు విమర్శించాలి? మీరు అలా చేస్తుండడం వల్ల మన పార్టీ టీడీపీతో, చంద్రబాబుతో కుమ్మక్కైనట్లు ప్రజలు భావిస్తున్నారు. ఇది సీపీఐకి ఎంత మాత్రం మంచిది కాదు. మీ ఇష్టాయిష్టాలు అంతిమంగా పార్టీపై నెగెటివ్ ప్రభావం పడుతూ, రాజకీయంగా నష్టం కలిగిస్తోంది. కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా మీరు స్వతంత్రంగా వ్యవహరించడానికి బదులు చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారన్న విమర్శల్ని మేం వినలేకున్నాం’.. అని కె. రామకృష్ణకు క్లాస్ ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు.
మనకు చంద్రబాబు అనుకూలం కాదన్నారు. చంద్రబాబుతో కలిసిపోవడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. జగన్ ప్రభుత్వంతో మన ఫైట్ మనం చేద్దామన్నారు. లౌకిక, వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులతో కలిసి ప్రయాణం చేయాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు నిలబడితే వారితో కలిసి నడవాల్సి వుంటుందని రామకృష్ణకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు కూడా బీజేపీకి అనుకూలమైన తీర్మానం చేశాడన్నారు.
బీజేపీని వ్యతిరేకించకూడదనే భావనలో చంద్రబాబు ఉన్నాడన్నారు. వైఎస్ జగన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నా, తనకున్న ఓటు బ్యాంకు, మోడీ పార్టీకి వ్యతిరేకమైందన్నారు. జగన్ ఓటు బ్యాంకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగానే జగన్ ఉంటాడనే రీతిలో చర్చ జరిగింది.
బడా సంస్థలకు సీఈఓనని చెప్పుకునే చంద్రబాబుతో అంటకాగాల్సిన అవసరం ఏంటని రామకృష్ణను నిలదీశారు. బూర్జువా పార్టీ ఇరుసుగా ఉండకూడదని హితవు చెప్పారు. జగన్ ప్రభుత్వంలో లోపాలు ఎత్తిచూపడం వేరు, జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం వేరని సమావేశంలో అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ కమ్యూనిస్టుల ప్రత్యర్థి కాదని, ఆయన సంక్షేమ పథకాలను స్వాగతిస్తూనే ఏమైనా లోపాలుంటే విమర్శిద్దామని నిర్ణయానికి వచ్చారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత చూపొద్దని రామకృష్ణకు హితవు చెప్పారు. మన పార్టీది ప్రజాపక్షమే తప్ప చంద్రబాబు పక్షం కాదని మరోసారి గట్టిగా చెప్పారు.
అయితే వైఎస్ జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వాలు వేర్వేరు అని సమావేశంలో అందరూ అభిప్రాయపడ్డారు. జనాన్ని, రాజకీయ పార్టీలను జగన్ కలవలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వైఎస్సార్ శత్రువును సైతం దగ్గరికి తీసి మాట్లాడి పంపించేవాళ్లన్నారు. కానీ జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ విధానం ప్రకారమే నడుచుకుంటున్నానని చెప్పుకొచ్చారు. తనకు జగన్‌తో వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు.
జగన్ తండ్రి రాజశేఖరరెడ్డితో తమకున్న అనుబంధాన్ని రామకృష్ణ, నారాయణ నెమరువేసుకున్నారు. అసెంబ్లీలో తాను మాట్లాడిన సందర్భంలో వైఎస్సార్ భుజం తట్టి ప్రోత్సహించేవారన్నారు. భిన్నాభిప్రాయాలున్నప్పటికీ రాజశేఖరరెడ్డి ఏనాడూ శత్రు భావనతో చూసే వారు కాదని ప్రశంసించారు. ముదిగొండలో వైఎస్సార్ ప్రభుత్వం కాల్పులకు పాల్పడినట్టు… సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేయని ఏకైక పార్టీ తమదే అని సమావేశంలో గుర్తు చేసుకున్నారు.
అలాగే ఎంతో చరిత్ర కలిగిన విశాలాంధ్ర పత్రికకు యాడ్స్ ఇవ్వకపోవడంపై సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే విశాలాంధ్రకు రావాల్సిన రూ.20 కోట్ల బకాయి సొమ్ము విడుదల చేయడంలోనూ జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని సీపీఐ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.