టీడీపీ మైలేజీ పెంచుతున్న వైసీపీ, అనుకూల మీడియా

అమరావతివాసులు టీడీపీని, చంద్రబాబుని ఎప్పుడో మర్చిపోయారు. ఉద్యమం కోసం బంగారు గాజులు త్యాగం చేసినప్పుడు ఆహా ఓహో అన్నారు, ఆ తర్వాత కనీసం అటువైపు మొహం చూపించకపోయే సరికి తమ పాట్లేవో తాము పడుతున్నారు.…

అమరావతివాసులు టీడీపీని, చంద్రబాబుని ఎప్పుడో మర్చిపోయారు. ఉద్యమం కోసం బంగారు గాజులు త్యాగం చేసినప్పుడు ఆహా ఓహో అన్నారు, ఆ తర్వాత కనీసం అటువైపు మొహం చూపించకపోయే సరికి తమ పాట్లేవో తాము పడుతున్నారు. ఈ క్రమంలో అమరావతి 600 రోజుల ఉద్యమానికి బహిరంగంగా మద్దతిచ్చేందుకు చంద్రబాబు కూడా ధైర్యం చేయలేదు. 

అప్పట్లో రెచ్చిపోయిన పవన్ కల్యాణ్ కూడా అటువైపు పోలేదు. వామపక్షాలు కూడా ఆ ఊసెత్తలేదు. బీజేపీ సైలెంట్ గానే ఉంది. దీంతో చేసేదేం లేక, పచ్చపాత మీడియా ఇస్తున్న ఉచిత ప్రచారమే ఊపిరిగా వారు ఇన్నాళ్లు ఉద్యమం పేరుతో తమ తంటాలు తాము పడుతున్నారు. ఇప్పుడు అధికార పార్టీ నేతలు అంతకు మించి అన్నట్టుగా అమరావతి అంశాన్ని హైలెట్ చేస్తున్నారు.

అమరావతి పేరుతో జరుగుతున్న ఉద్యమం పలు కీలక మైలురాళ్లని దాటిందంటూ పేపర్లో వచ్చేవరకు ఎవరికీ తెలియదు. ఉద్యమం 100 రోజులు, 200 రోజులు, ఏడాది, 500 రోజులు.. ఇలా అనేక సందర్భాల్లో మీడియా వారిని హైలెట్ చేయడం, ఆ తర్వాత ఖాళీ టెంట్లు, ఖాళీ కుర్చీలు కనిపించడం అందరికీ తెలిసిందే. తాజాగా 600 రోజుల పేరుతో జరిగిన న్యాయస్థానం టు దేవస్థానం ర్యాలీ విషయంలో టీడీపీ అనుకూల మీడియా దాన్ని బాగానే హైలెట్ చేసింది.

మీడియా మాయలో పడి వైసీపీ నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తూ.. ఉచిత ప్రచారం ఇచ్చేశారు. వైసీపీ నేతల ప్రసంగాల్ని తప్పనిసరిగా ప్రచారం చేయాల్సిన సాక్షి కి కూడా ఇది తప్పలేదు. దీంతో అన్ని ఛానెళ్లలోనూ అమరావతి హైలెట్ అయింది. అలా వైసీపీ నేతలు అనవసరంగా అమరావతి అంశాన్ని టచ్ చేసి, టీడీపీని హైలెట్ చేశారు.

టీడీపీ మైలేజీ పెరిగిందిలా..!

అమరావతి ఉద్యమానికి, టీడీపీకి ప్రస్తుతం సంబంధమే లేదనే విషయం తేలిపోయింది. అమరావతి పేరుతో జరుగుతున్న నిరసనల్లో టీడీపీ నేరుగా పార్టిసిపేట్ చేయడంలేదు, లోపాయికారీగా ఆర్థిక ఊతం ఇస్తే ఇవ్వొచ్చు కానీ, టీడీపీ మొహాలేవీ అక్కడ కనపడ్డంలేదు. ఈ క్రమంలో 600 రోజుల ఉద్యమం పేరుతో అమరావతిలో టీడీపీ కుట్ర చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు. బహుజన పరిరక్షణ సమితి పేరుతో నిరసన చేపట్టిన మరో బ్యాచ్ తో కూడా ఇవే ఆరోపణలు చేపించారు.

అసలు టీడీపీయే ఆశలు వదిలేసుకున్న సందర్భంలో.. వారిని అవసరంగా హీరోలుగా మార్చేస్తున్నారు వైసీపీ నేతలు. అమరావతి, టీడీపీకి అవినాభావ సంబంధం ఉందని తేల్చేస్తున్నారు. అమరావతిలోనే కాదు, ఏపీలో ఎక్కడా టీడీపీకి అంత సీన్ లేదనే విషయం ఆల్రడీ స్థానిక ఎన్నికల్లో రెండోసారి తేలిపోయింది. కానీ వైసీపీ మాత్రం అమరావతిని టీడీపీ గుప్పెట్లో పెట్టుకుందని, గ్రామస్తుల్ని రెచ్చగొడుతోందని, ఆందోళనలు చేయిస్తోందని లేనిపోని మైలేజీ ఇస్తోంది.

న్యాయస్థానం టు దేవస్థానం అంటూ అమరావతి అనుకూల వర్గాలు కార్యక్రమం మొదలు పెడితే, వైరి వర్గం దేవస్థానం టు న్యాయస్థానం అంటు పోటా పోటీగా మరో కార్యక్రం మొదలు పెట్టింది. రెండుచోట్లా అరెస్ట్ లు జరిగాయి. అయితే ఇక్కడే అధికార పక్షం మరీ కామెడీగా వ్యవహరించింది. అమరావతి అంశాన్ని మరుగున పడేసేందుకు పడరాని పాట్లు పడింది, పరోక్షంగా టీడీపీకి లబ్ధి చేకూర్చింది. పట్టించుకోకుండా వదిలేస్తే అది చాలా చిన్న విషయం. కానీ దాన్నే పట్టుకుని వేలాడే సరికి, ఆందోళనలు, అరెస్ట్ లతో అదో పెద్ద అంశంగా మారింది.