రాజకీయ నాయకులు ఎప్పుడూ ఒక మాట మీద వుండరు.. వుండలేరు. అందుకే రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, శాశ్వత మితృత్వం వుండవు అని అంటారు. ఈసారి ఎన్నికల్లో దారుణ పరాజయం పొందిన తెలుగుదేశం పార్టీ, మళ్లీ ఎప్పుడో మూడు, నాలుగేళ్ల తరువాత రాబోయే ఎన్నికల కోసం ముందుగానే జనసేనతో పొత్తుకు దిగుతుందని చిరకాలంగా వార్తలు వున్నాయి. అయితే అవన్నీ ఊహాజనిత వార్తలే. లేటెస్ట్ గా తెలుగుదేశం అనుకూల పత్రికలో కాస్త గట్టిగానే ఈ విధమైన వార్తలు వచ్చాయి. దాంతో జనసేన సోషల్ మీడియా విభాగం నుంచి ఘాటైన కౌంటర్ వచ్చింది.
''….ఎల్లో మీడియాకు తెలుగుదేశం పార్టీకి పొత్తు ఉందే తప్ప, మీ పొత్తుతో జనసేనకు ఎటువంటి సంబంధం లేదు, విలువలు లేని ఎల్లో మీడియా, విలువలు తెలియని టీడీపీ పార్టీతో కలిసి నడవాల్సిన అవసరం @JanaSenaParty కి లేదు. మీ తప్పుడు రాతలు అదుపులో పెట్టుకుంటే అందరికి మంచిది….'' ఇదీ ఆ కౌంటర్.
ఎల్లో మీడియాకు, తెలుగుదేశం పార్టీకి పొత్తు వుందని ఘాటుగా వ్యాఖ్యానించడమే కాకుండా, ఆ పత్రిక రాసిన వార్త క్లిప్పింగ్ ను కూడా అక్కడ జోడించారు. పైగా ఆ మీడియాకే కాదు, తెలుగుదేశం పార్టీకి సైతం విలువలు లేవని, అలాంటి వారితో కలిసి నడవాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు.
ఇంతఘాటుగా సమాధానం ఇచ్చాక, మరి భవిష్యత్ లో ఎప్పుడైనా జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ మడమ తిప్పుతారు అని అనుకోవడానికి ఆస్కారం వుంటుందా? ఇప్పుడు కాకున్నా, మారే పరిణామాల రీత్యా తేదేపా-జనసేన పొత్తు చిగురిస్తుందా? ఒకప్పుడు తేదేపా-జనసేన మిత్రులే. కానీ తరువాత తరువాత శతృవులుగా మారారు. అయితే ఎన్నికల టైమ్ లో లోపాయకారీ పొత్తువుందని విపరీతంగా ఊహాగానాలు చెలరేగాయి. దాంతో జనసేన విజయావకాశాలు బాగా దెబ్బతిన్నాయి.
ఇప్పుడు కూడా ఇంకా అదే ప్రచారం సాగుతోంది అంటే జనసేనను ఇంకా పునాదుల్లోకి తొక్కేయాలన్న ప్రయత్నం సాగుతుందేమో? అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అందుకే జనసేనకు ఇంత కోపం వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే అంత ఘాటు రిప్లయ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.
మరి ఈ కోపం, ఈ స్టాండ్ మళ్లీ ఎన్నికల వరకు అలాగే వుంటుందా? మారుతుందా? ఏమో?