ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల కీల‌క నిర్ణ‌యాలు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకుని చివ‌రి నిమిషంలో ద‌క్క‌క‌పోవ‌డంతో ఆశావ‌హులు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో వేర్వేరు పార్టీల‌కు చెందిన ఇద్ద‌రు మ‌హిళా నేత‌లు రాజీనామాల వైపు అడుగులు వేస్తున్నారు. త‌మ‌ను…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకుని చివ‌రి నిమిషంలో ద‌క్క‌క‌పోవ‌డంతో ఆశావ‌హులు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో వేర్వేరు పార్టీల‌కు చెందిన ఇద్ద‌రు మ‌హిళా నేత‌లు రాజీనామాల వైపు అడుగులు వేస్తున్నారు. త‌మ‌ను అవ‌మానించిన పార్టీల ఓట‌మే ధ్యేయంగా ఇత‌ర పార్టీల్లో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు.

కాంగ్రెస్ నాయ‌కురాలు పాల్వాయి స్ర‌వంతి, బీజేపీ లీడ‌ర్ తుల ఉమ తాము ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పార్టీల‌కు రాజీనామాలు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. మునుగోడు టికెట్‌ను కాంగ్రెస్ నాయ‌కురాలు స్ర‌వంతి ఆశించారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పాల్వాయి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి కుమార్తె స్ర‌వంతి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి వీడిన సంద‌ర్భంలో పార్టీ శ్రేణుల‌కు ఆమె అండ‌గా నిలిచారు.

మునుగోడు ఉప ఎన్నిక‌లో స్ర‌వంతి పోటీ చేశారు. అయితే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేర‌డంతో ఆశావ‌హులు ఖంగుతిన్నారు. కాంగ్రెస్ టికెట్‌ను చ‌ల‌మ‌ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్ర‌వంతి ఆశించారు. వీళ్లిద్ద‌రికీ కాద‌ని తిరిగి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో చ‌ల‌మ‌ల కృష్ణారెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరారు. ప్ర‌స్తుతం మునుగోడులో బీజేపీ త‌ర‌పున ఆయ‌న బ‌రిలో నిలిచారు.

మ‌రోవైపు కాంగ్రెస్‌లోనే స్ర‌వంతి కొన‌సాగేందుకు నిర్ణ‌యించారు. కానీ త‌న‌ను రాజ‌గోపాల్‌రెడ్డి అస‌లు ప‌ట్టించుకోలేద‌నే అసంతృప్తి ఆమెలో మొద‌లైంది. క‌నీసం నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి కూడా ఆహ్వానించ‌లేద‌ని స్ర‌వంతి త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోయారు. ఇప్పుడే ఇట్లా వుంటే, భ‌విష్య‌త్‌లో అస‌లు ప‌ట్టించుకోర‌నే ఆవేద‌నే… సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని తెంచుకోడానికి దారి తీసింది.

గ‌త రాత్రి మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డితో స్రవంతి, ఆమె అనుచ‌రులు సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఇవాళ మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు.

బీజేపీ నాయ‌కురాలు తుల ఉమ ప‌రిస్థితి మ‌రీ ఘోరం. వేముల‌వాడ టికెట్ ఆమెకు ఇచ్చిన‌ట్టే ఇచ్చి, వెన‌క్కి తీసుకున్నారు. దీంతో ఆమె కన్నీరుమున్నీర‌వుతున్నారు. వేముల‌వాడ‌లో ఆమె నామినేష‌న్ కూడా వేశారు. అయితే బీ ఫామ్ మాత్రం బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ గ‌వ‌ర్న‌ర్ సీహెచ్ విద్యాసాగ‌ర్‌రావు త‌న‌యుడు వికాస్‌రావుకు ఇచ్చారు. దీంతో తుల ఉమ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో వుంటాన‌ని ప్ర‌క‌టించారు. బీసీ మ‌హిళ‌ను కావ‌డంతోనే త‌న‌కు అన్యాయం చేశార‌ని ఆమె వాపోయారు. పార్టీకి రాజీనామా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. తుల ఉమ‌తో బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అయితే ఏ పార్టీలో చేరుతార‌నేది తేల‌లేదు.