ప్రత్యేక హోదాపై నాలుగేళ్లు నాన్చి చివరకు సొంతలాభం కోసం ప్రభుత్వం నుంచి బైటకొచ్చిన పార్టీ ఒకటి. అసలు ప్రత్యేక హోదాను ప్రజలే కోరుకోవడం లేదు, వారికే ఇష్టంలేదని జనం మీద నెపం నెట్టి బీజేపీ పంచన చేరిన పార్టీ ఒకటి. ఇలాంటి ప్రతిపక్షాల మధ్య అధికార వైసీపీ మరోసారి ఏపీ ప్రత్యేక హోదాపై పెదవి విప్పింది. ఏడాది పాలన రివ్యూ సందర్భంగా సీఎం జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. సహజంగానే ఆయన మాటల్ని వక్రీకరించి పచ్చపాత పత్రికలన్నీ ఈరోజు కథనాలు వండివార్చాయి.
“హోదా బహుదూరం” అని ఒకరు, “ఇప్పట్లో కష్టమే”నంటూ మరొకరు కథనాలిచ్చారు. అయితే జగన్ వ్యాఖ్యలు ప్రత్యేక హోదాపై ప్రజల్లో మరోసారి ఆశలు చిగురింపజేసేయనేది మాత్రం వాస్తవం. గత ఎన్నికల ప్రచారంలో ఫుల్ మెజార్టీ ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని చెప్పిన జగన్, ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చిందో వివరించారు. కేంద్రంలో పూర్తి మెజార్టీ ప్రభుత్వం ఉన్న వేళ, బెదిరించడానికి, భయపెట్టి పనులు చేయించుకోడానికి ఎవరికీ వీలు పడదు.
మన టైమ్ కలిసొచ్చే వరకు వేచి చూడాలి. అంతమాత్రాన మనం కేంద్రం ముందు సాగిలపడినట్టు కాదు, అదను కోసం ఎదురు చూస్తున్నట్టే. వేటాడేముందు సింహం కూడా ఒక అడుగు వెనక్కి వేసి అదనుకోసం చూస్తుంది. అలా మనం ప్రత్యేక హోదా కోసం ఎదురు చూడాల్సిందేనని, సమయం వస్తే మొహమాటం లేకుండా కేంద్రం మెడలు వంచి మనకు న్యాయబద్ధంగా రావాల్సినదాన్ని సాధించుకోవాల్సిందేనని చెప్పారు జగన్.
ప్రత్యేక హోదా ఇస్తామని మాటిచ్చిన కాంగ్రెస్… ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని కబుర్లు చెప్పిన బీజేపీ.. రెండూ నవ్యాంధ్ర ప్రజల్ని దారుణంగా మోసం చేశాయి. ఏపీ అసెంబ్లీలో ఎంట్రీ లేకుండా చేసిన మోసానికి ప్రతిఫలం అనుభవిస్తున్నాయి. కానీ కేంద్రంలో మాత్రం బీజేపీదే ఫుల్ మెజార్టీ. ఆ మెజార్టీ దూరమైన వేళ, సంకీర్ణం కోసం అర్రులు చాచే వేళ, పట్టుబట్టి ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవచ్చు. వైసీపీ సీట్లే కేంద్రంలో మెజార్టీకి కీలకమైన సమయంలో ప్రణాళికా సంఘం ఒప్పుకోవట్లేదంటూ ఏ పార్టీ కూడా కల్లబొల్లి కబుర్లు చెప్పే సాహసం చేయదు. మిగతా రాష్ట్రాలకు తాయిలాలిచ్చయినా సరే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.
అదే సీఎం జగన్ ఆలోచన. ఆరోజు ఎంతో దూరంలో లేదని.. ఆయన వాదన. వలస కార్మిక విలాపం.. శాపమై తగిలితే, ఒంటెత్తు పోకడలతో తీసుకున్న నిరంకుశ నిర్ణయాలన్నీ ఉరితాళ్లయితే.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణం ఏర్పడక తప్పదు. కాంగ్రెస్ లేదా బీజేపీ.. ఏదో ఒకటి సంకీర్ణానికి నాయకత్వం వహించే సందర్భంలో ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ కీలకంగా మారుతుంది. అలాంటి సమయంలో హోదా సాధించుకోవచ్చనేది జగన్ ఆలోచన.
ముక్కి ముక్కి మూడు ఎంపీ సీట్లు గెల్చుకున్న టీడీపీకి.. రాబోయే రోజుల్లో అవికూడా సందేహమే. ఏపీ ఎంపీ సీట్లన్నీ వైసీపీ ఖాతాలో పడి, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే పార్టీ సంకటంలో పడితే.. ఏపీకి హోదా రాకుండా ఎక్కడికి పోతుంది. అందితే జుట్టు పట్టుకోవాలి, అందకపోయినా జుట్టు పట్టుకోడానికి వేచి చూడాలి. ఇదీ జగన్ పాలసీ. తప్పు లేదు. తప్పలేదు.