విశాఖ నగరం అంటేనే దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే వేగంగా అభివ్రుధ్ధి చెందే సిటీగా అంతా గుర్తిస్తారు. ఇవాళా నిన్నా వచ్చిన గుర్తింపు ఇది కాదు, బ్రిటిష్ పాలకులు వందేళ్ల క్రితమే విశాఖను జిల్లాగా చేసి తగినరీతిన అభివ్రుధ్ధి చేసి వెళ్లారు.
ఆ తరువాత విశాఖను దేశీయ పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఉమ్మడి ఏపీలో విశాఖ మూలన విసిరేయబడినట్లుగా ఉందని వదిలేశారు. విభజన తరువాత అయినా విశాఖకు మర్యాదా, మన్నగా దక్కుతాయనుకుంటే ఆ ఆశలు ఆవిరి అయ్యాయి.
ఇపుడు వైసీపీ సర్కార్ విశాఖను పాలనారాజధానిని చేస్తామంటోంది. దానీ తగిన విధంగా అభివ్రుధ్ధి చేస్తామని చెబుతోంది. విశాఖ మెట్రో రైలు బూజు దులుపుతున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తాగుసాగు నీటి ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తామంటున్నారు.
విశాఖలో స్కిల్ డెవెలప్మెంట్ యూనివర్శిటీనే ఏర్పాటు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం పట్ల కూడా హర్షం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా విశాఖ ఏపీలో ఏకైక మెగా సిటీ అంటూ జగన్ కితాబు ఇవ్వడంతో విశాఖ ప్రగతికి ఢోకా లేదని ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖను అభివ్రుధ్ధి చేసుకుంటేనే బెంగుళూర్, చెన్నై వంటి మెగా సిటీలతో పోటీపడగలమని జగన్ చెప్పడాన్ని ఆయన దార్శనికతగా మేధావులు అభివర్ణిస్తున్నారు. ఇపుడు ప్రగతి కునారిల్లి నిధులు లేక తీరని దాహంతో ఏపీ అంతా ఉంది. ఇప్పటికిపుడు నుయ్యి తవ్వి నీళ్ళు అందించేసరికి ప్రాణాలు గాలిలో కలుస్తాయి.
అందువల్ల ఉన్న దాంటో బెస్ట్ సెటీగా ఉన్న విశాఖను గ్రోత్ ఇంజన్ గా చేసుకుని ఏపీని పరుగులు పెట్టించాలనుకోవడం మంచి పరిణామమేనని అంతా అంటున్నారు. మరి ఆ దిశగా తగిన యాక్షన్ ప్లాన్ తో వైసీపీ సిధ్ధంగా ఉన్నట్లు స్వయంగా ముఖ్యమంతి చెబుతున్న మాటలే తెలియచేస్తున్నాయి. మొత్తానికి అన్ని రకాలుగా విశాఖకు మంచి రోజులు వస్తాయనడంలో సందేహం లేదు.