Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: పొన్మగళ్ వందాళ్

సినిమా రివ్యూ: పొన్మగళ్ వందాళ్

చిత్రం: పొన్మగల్ వందాళ్ (తమిళం)
రేటింగ్: 2.5/5
బ్యానర్:
2డి ఎంర్‌టైన్‌మెంట్
తారాగణం: జ్యోతిక, పార్తీబన్, భాగ్యరాజా, త్యాగరాజన్, ప్రతాప్ పోతన్ తదితరులు
సంగీతం: గోవింద్ వసంత
కూర్పు: రూబెన్
ఛాయాగ్రహణం: రామ్‌జీ
నిర్మాతలు: సూర్య, జ్యోతిక
కథ, కథనం, దర్శకత్వం: జె.జె. ఫ్రెడ్‌రిక్
విడుదల తేదీ: మే 29, 2020
వేదిక: అమెజాన్ ప్రైమ్

సినిమా థియేటర్లు మూతపడిన వేళ ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘సినిమా’ కొత్త వేదికలు వెతుక్కుంటోంది. ఓవర్‌దిటాప్ వేదిక ద్వారా తమిళ చిత్ర సీమ నుంచి ఒక చెప్పుకోతగ్గ చిత్రం రిలీజ్ అయింది. సూర్య నిర్మాణంలో జ్యోతిక నటించిన ‘పొన్మగళ్ వందాళ్’ అమెజాన్ ప్రైమ్ ద్వారా నేడు విడుదలయింది. జెజె ఫ్రెడ్‌రిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలికలపై జరుగుతోన్న అత్యాచారాల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. అమ్మాయిలకు జాగ్రత్తగా వుండమని బోధించే తల్లిదండ్రులు... అబ్బాయిలకి వారిని గౌరవించడం కూడా నేర్పించాలనే బలమైన, అవసరమైన సందేశాన్నిస్తుంది. 

ఉద్దేశం మెచ్చుకోతగింది. సందేశం అవసరమయింది. కాకపోతే అందుకోసం ఈ చిత్ర దర్శకుడు ఎంచుకున్న మార్గం, తన కథని చెప్పిన విధానానికి మాత్రం మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తాయి. ఇలాంటి అంశాన్ని ఎంత రియలిస్టిక్‌గా చెబితే అంతగా కదిలిస్తుంది. పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు, సంఘటనలు ఎంత వాస్తవికంగా వుంటే అంత ఎమోషనల్ కనక్ట్ ఏర్పడుతుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అలాంటి రియలిస్టిక్ అప్రోచ్‌కి అప్రీసియేషన్ ఎక్కువ. కానీ దర్శకుడు ఫ్రెడ్‌రిక్ తన కథని బి, సి సెంటర్స్‌లోని సింగిల్ థియేటర్స్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని తీసినట్టుంది. కోర్ట్ రూమ్‌లో డిఫెన్స్, ప్రాసిక్యూషన్ లాయర్లు ఒకరిపై ఒకరు పైచేయి సాధించే వాదనలతో చాలా సమయం గడచిపోతుంది. అయితే ఈ కథ ఎటుగా వెళుతోందీ, ముందు ఏమి జరగబోతోందీ అనేది క్లియర్‌గా తెలిసిపోతూ వుంటుంది. సీక్రెట్స్‌గా, ట్విస్ట్స్‌గా భావించినవి అన్నీ ఈజీగా ఊహించేయవచ్చు. 

కథగా చెప్పుకుంటే... పదిహేనేళ్ల క్రితం సైకో కిల్లర్‌గా ముద్ర పడి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన జ్యోతి కేస్‌ని మళ్లీ ఓపెన్ చేస్తూ ఒక యువ లాయర్ వెంబ (జ్యోతిక) పిటీషన్ వేస్తుంది. ఆమెకి ప్రత్యర్ధిగా పేరుమోసిన క్రిమినల్ లాయర్ రాజారత్నం (పార్తీబన్) దిగుతాడు. అసలు జ్యోతి కథేంటి? ఆమెపై సైకోగా ఎందుకు ముద్ర పడింది? ఇప్పుడు వెంబ ఈ కేసుని ఎందుకంత పర్సనల్‌గా తీసుకుంది? 

ఈ కథ ఫస్ట్ హాఫ్ దాదాపుగా కోర్ట్ రూమ్‌లో వాద ప్రతివాదాలతోనే సాగిపోతుంది. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి అసలు ఏమి జరిగింది, దాని వల్ల ఎవరి జీవితం బలయింది లాంటి ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. కేసు లీగల్‌గా గెలవడానికి దారులన్నీ మూసుకుపోయిన తరుణంలో ఒక పచ్చి నిజాన్ని వెంబ ప్రపంచానికి చెబుతుంది. అయితే కన్నీళ్లే తప్ప ఆధారాలు లేని వాస్తవానికి కోర్టులో న్యాయం జరుగుతుందా? 

సమాజంలో నిత్య‘అకృత్య’మయిన ఈ కథని ‘థియేట్రిక్స్’ లేకుండా హార్డ్ హిట్టింగ్‌గా చెప్పడం చాలా ముఖ్యం. ఎంత వాస్తవికత చూపిస్తే అంతగా పాత్రల తాలూకు ‘పెయిన్’ తెలుస్తుంది. కానీ దర్శకుడు తన ఎమోషన్ చెప్పడానికి ‘డ్రామా’ని ఎంచుకున్నాడు. అలాగే జరిగిన దారుణాన్ని తెలియజేయడానికి రక్తసిక్తమయిన బాలికలపై కెమెరా పాన్ చేస్తూ చూపించాల్సిన పని లేదు. ఇలాంటివి మనల్ని కదిలించడం పోయి మనసు పాడు చేస్తాయి. అయితే సెన్సిబుల్‌గా సన్నివేశాలని చూపించడమనేది ఫ్రెడ్‌రిక్ స్టయిల్ కాదని ఆరంభ సన్నివేశాల్లోనే స్పష్టమవుతుంది. బాలికల మృతదేహాలని బయటకు వెలికి తీయగానే... అది చూస్తోన్న వారిలో ఒకావిడ అది షూట్ చేస్తోన్న మీడియా కెమెరాపై వాంతి చేసుకుంటుంది. చాలా సన్నివేశాల్లో ఈ ‘అతి’ పోకడలు, అవసరానికి మించిన నాటకీయత హైలైట్ అవుతూ అసలు అంశాన్ని డైల్యూట్ చేసేస్తుంటుంది. 

అయితే ఆడియన్స్ అటెన్షన్‌ని ెల్డ్ చేసి ఉంచేది మాత్రం జ్యోతిక అభినయం. ఆమెలోని గొప్ప నటి సాక్షాత్కరించే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. తను పోషించిన పాత్ర తాలూకు భావోద్వేగాలని జ్యోతిక అద్భుతంగా పలికించింది. పార్తీబన్, భాగ్యరాజా తమ పాత్రలకు న్యాయం చేసారు కానీ పాత్రచిత్రణలో నాటకీయత ఎక్కువయింది. జడ్జి పాత్రలో ఎక్కువసేపు పాసివ్‌గా వుండే ప్రతాప్ పోతన్‌కి కూడా ఒక పవర్‌ఫుల్ సీన్ వుంటుంది. తనకిచ్చే గౌరవం కాస్త తగ్గినా ఆవేశంతో ఊగిపోయే పాత్రలో త్యాగరాజన్ నటన కూడా మెప్పిస్తుంది. 

ఈ తరహా కథాంశాలకి వాష్డ్ అవుట్ కలర్ ప్యాలెట్‌ని, డార్క్ లైటింగ్‌ని సినిమాటోగ్రాఫర్లు వాడుతుంటారు. కానీ ఈ చిత్రానికి ఒక పది, పదిహేనేళ్ల క్రితం నాటి పోకడలే కనిపించాయంటే అది బహుశా దర్శకుడి ఛాయిస్ కావచ్చు. ఎడిటింగ్‌లో కూడా హడావిడి కనిపించింది. ఒక సన్నివేశం నుంచి మరో సన్నివేశానికి స్మూత్ ట్రాన్సిషన్ లేదు. బహుశా అది లాక్‌డౌన్ పరిమితుల వల్ల అయి వుండొచ్చు. నేపథ్య సంగీతం ఎమోషనల్ సీన్స్‌లో బాగుంది. నిర్మాణ పరంగా సూర్య రాజీ పడలేదు. దర్శకుడు ఫ్రెడ్‌రిక్‌కి మహిళల వ్యధలని ఆవిష్కరించాలని, మగాళ్లలో మార్పు తేవాలని మంచి ఆలోచనలున్నాయి కానీ దానిని సినిమాటిక్‌గా కాకుండా హార్ట్ టచింగ్‌గా ప్రెజెంట్ చేసే విషయంలో సెన్సిబులిటీస్ మాత్రం అందరినీ మెప్పించేట్టు లేవు. పతాక సన్నివేశాలలో న్యాయం జరగడానికి తగిన స్టఫ్ వాదనలో లేకపోయినా కానీ హడావుడిగా సినిమాటిక్ ముగింపునిచ్చేసాడు. 

మనసు పాడు చేసే వీడియోలకి ‘వ్యూయర్ డిస్‌క్రెషన్’ వార్నింగ్‌తో సోషల్ మీడియాలో సెన్సార్‌షిప్ జరుగుతుంటుంది. అలాంటి వార్నింగులేమీ లేకుండా కొన్ని హృదయ విదారక దృశ్యాలని ఈ చిత్రం చూపిస్తుంది. సినిమా అనేది దృశ్య సాధనమే అయినా కానీ కొన్నిసార్లు ప్రేక్షకుల ‘ఊహ’కి వదిలేయడం ఉత్తమం అనేది గుర్తుంచుకోవాలి. ఎమోషనల్‌గా కదిలించడానికి ఈమాత్రం చూపించాలనుకుంటే అది దర్శకుడి పరాజయమనే అనుకోవాలి. ‘మీటూ’ నేపథ్యంలో పలువురు వినిపించిన కన్నీటి గాధలకి ఇది సినిమా రూపమిచ్చింది. ఖచ్చితంగా గుర్తించాల్సిన, చర్చించాల్సిన, ఆలోచించాల్సిన, పరిష్కారం అన్వేషించాల్సిన అంశమే కానీ అందుకోసం ఇంతకంటే మంచి సినిమా అవసరమనిపిస్తుంది. ఎందుకంటే సినిమా పూర్తయ్యాక ఆలోచన రేకెత్తించడం, జరిగిన అన్యాయం మనసుని వెంటాడడం కంటే వేరే ఏదైనా ప్లెజెంట్ సీన్ చూడాలనే సాంత్వన కోరుకుంటుంది. 

బాటమ్ లైన్: మీటూ... ఇలాక్కాదు!   

గణేష్ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?