ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది చంద్రబాబు వ్యవహారం. అసలు అమరావతి ఉద్యమమే లేదంటుంటే, అది చరిత్రాత్మకం అని చంద్రబాబు అనడం విడ్డూరం కాక మరేంటి? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
అమరావతి పరిరక్షణ ఉద్యమం 600వ రోజుకు చేరిందని ఎల్లో బ్యాచ్ ఉత్సవాలు చేస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు తన మార్క్ ఉట్టిపడేలా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సేవ్ అమరావతి నినాదంతో అమరావతి ఐకాస, దళిత ఐకాస 600 రోజులుగా చేస్తున్న పోరాటం చరిత్రాత్మకమని చంద్రబాబు పేర్కొన్నారు.
సీఎం జగన్ దాడి అమరావతిపై కాదని, యావత్ రాష్ట్ర సంపద సృష్టిపైనే ఆయన దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాలం చెల్లిన డైలాగ్లను చంద్రబాబు ఇప్పటికైనా విడిచి పెడితే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. తన అభిప్రాయాల్ని, ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలందరికీ అంటకట్టడం చంద్రబాబుకు మొదటి నుంచి వెన్నతో పెట్టిన విద్య అనే విమర్శ లొస్తున్నాయి.
రాష్ట్ర సంపద అంటే అమరావతి మాత్రమేనా? అని ప్రశ్నించే వాళ్లకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? అమరావతి పరిరక్షణ సంగతి తర్వాత చూసుకోవచ్చని, ముందు తన పార్టీని రక్షించుకునే చర్యలను చేపట్టాలని సూచిస్తున్నారు. ఎంతసేపూ ఎస్సీ, ఎస్టీ, మహిళలు, రైతులను ముందుకు తెస్తూ, అమరావతిలో బడాబాబుల వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.
అమరావతిలో దళితుల భూములను అప్పనంగా కొని, వాటిని వక్రమార్గంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న సంగతి అందరికీ తెలుసని అంటున్నారు. కొన్ని రాజ్యాంగ వ్యవస్థలు అమరావతిలో ఇన్సైడర్ జరగలేదని చెప్పినంత మాత్రాన …అది నిజమవుతుందా? అని ప్రశ్నించే వాళ్ల సంఖ్య ఎక్కువే.